భారత్ ఓ ప్రయోగశాల అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు

  • ఓ పాడ్ కాస్ట్ లో భారత్ గురించి వ్యాఖ్యానించిన గేట్స్
  • భారత్ అనేక క్లిష్టమైన విషయాలకు వేదిక అని వెల్లడి
  • కొత్త విషయాలు ప్రయోగించి చూడడానికి భారత్ తగిన వేదిక అని వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఓ పాడ్ కాస్ట్ లో భారత్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలకు దారితీశాయి. 

ఇంతకీ బిల్ గేట్స్ ఏమన్నారంటే... "భారతదేశంలో చాలా విషయాలు కష్టసాధ్యం అని చెప్పాలి. ఆరోగ్యం, పోషకాహారం, విద్య వంటి రంగాల్లో దేశం మెరుగవుతూ ఉంది. ఇక్కడి ప్రభుత్వం సొంతంగా ఆదాయం పొందుతోంది. ఆ లెక్కన భారత ప్రజలు మరో 20 ఏళ్లకు మెరుగవుతారు. 

అనేక క్లిష్టమైన అంశాలతో కూడిన భారత్ ను ఓ ప్రయోగశాల అని చెప్పొచ్చు. అనేక విషయాలను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు వేదికగా భారత్ ను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ విజయవంతమైతే, ఆ విధానాలను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా పరిచయం చేయొచ్చు" అని పేర్కొన్నారు. 

అయితే, భారత్ ను ఓ ప్రయోగశాల అని బిల్ గేట్స్ పేర్కొనడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. బిల్ గేట్స్ కు భారతదేశంలో ఓ ల్యాబొరేటరీ లాగా, మేం గినియా పిగ్స్ (ప్రయోగశాలల్లో వాడే పందికొక్కులు)లాగా కనిపిస్తున్నట్టుంది అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారతీయులు బిల్ గేట్స్ కంటికి శాంపిల్స్ లాగా కనిపిస్తున్నారా అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. 

కొందరు నెటిజన్లు మాత్రం గేట్స్ ను సమర్థిస్తున్నారు. బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యల్లో తప్పుగా భావించాల్సిందేమీ లేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.


More Telugu News