మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... విటమిన్-డి లోపించినట్టే!

  • మనిషి ఆరోగ్యానికి అత్యంత అవసరమైనది... విటమిన్ డి
  • వ్యాధి నిరోధక శక్తి పెంపుదలకు ఉపయోగపడే విటమిన్
  • ఈ విటమిన్ లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు
మనిషి ఆరోగ్యానికి అత్యంత కీలకమైనది విటమిన్-డి. ముఖ్యంగా ఎముకల పటిష్టతకు, వ్యాధి నిరోధకశక్తి పెంపుదలకు ఇది ఎంతో అవసరం. దీన్ని సన్ షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఇది ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఎక్కువగా ఎండలో తిరగని వారిలో విటమిన్-డి లోపం కనిపిస్తుంటుంది. విటమిన్-డి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ ముఖ్యమైన విటమిన్ లోపించిన విషయం గుర్తించే సరికి, జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

విటమిన్-డి లోపిస్తే ఏం జరుగుతుందంటే...

  • ఎముకలు బలహీన పడతాయి. పెద్దల్లో ఆస్టియోమెలాసియా, పిల్లల్లో రికెట్స్ వ్యాధి కనిపిస్తాయి. 
  • ఎంత నిద్రపోయినా ఉత్సాహం ఉండదు... శక్తి విహీనంగా ఉంటారు. దీర్ఘకాలంగా అలసట వేధిస్తూ ఉంటుంది.
  • వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. సాధారణ జలుబు, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు బాధిస్తుంటాయి.
  • మానసిక సమతుల్యత లోపిస్తుంది. కుంగుబాటు (డిప్రెషన్), ఆందోళన (యాంగ్జైటీ)కు గురవుతుంటారు. ముఖ్యంగా, సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ (ఎస్ఏడీ)కి కారణం విటమిన్-డి లోపమే.
  • జుట్టు పలుచబడడం, వెంట్రుకలు రాలిపోవడం దీని ప్రభావమే. 
  • కండరాల నొప్పులు వస్తాయి. మెట్లు ఎక్కినప్పుడు విపరీతమైన కాళ్ల నొప్పులు, కూర్చున్న చోట నుంచి పైకి లేవలేకపోవడం విటమిన్-డి లోపానికి సంకేతాలు.
  • శరీరంలో విటమిన్-డి స్థాయులు తగ్గితే... గాయాలను నయం చేసుకునే శక్తిని శరీరం కోల్పోతుంది. దెబ్బతిన్న కణజాలానికి శరీరం మరమ్మతులు చేసుకోలేదు.

విటమిన్-డి లోపాన్ని ఎలా అధిగమించవచ్చంటే...

  • కొవ్వుతో ఉన్న సాల్మన్, మాక్రెల్ చేపలు, కోడిగుడ్డు పచ్చ సొన, బలవర్ధకమైన పాలు తీసుకోవాలి.
  • పోషక విలువలతో కూడిన ధాన్యాలకు దైనందిన ఆహారంలో చోటివ్వాలి. పుట్టగొడుగులు కూడా విటమిన్-డిని సమృద్ధిగా కలిగి ఉంటాయి. 
  • తగినంత సమయం ఎండలో తిరగడం సాధ్యం కాని వారు వైద్యులను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మోతాదు మేరకు విటమిన్-డిని సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి.



More Telugu News