ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో ప‌డ‌ని 'పుష్ప‌2' బొమ్మ‌.. కార‌ణం ఇదే!

  • తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప‌2: ది రూల్' మేనియా 
  • హైద‌రాబాద్ న‌గ‌ర‌వ్యాప్తంగా దాదాపు అన్ని థియేట‌ర్ల‌లో 'పుష్ప‌2' షోలు 
  • ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఓపెన్ కాని అడ్వాన్స్ బుకింగ్స్ 
  • ప్ర‌సాద్ యాజ‌మాన్యం, సినిమా మేక‌ర్స్ మ‌ధ్య డీల్ సెట్ కాక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం
తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా ఇప్పుడు పుష్ప‌2 ది రూల్ మేనియా న‌డుస్తోంది. నిన్న రాత్రి నుంచి ప్రీమియ‌ర్ షోల‌తో ఈ మూవీ సంద‌డి మొద‌లైంది. దాంతో థియేట‌ర్ల వ‌ద్ద బ‌న్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో కోలాహ‌లం చేస్తున్నారు. ఇక హైద‌రాబాద్ న‌గ‌ర‌వ్యాప్తంగా దాదాపు అన్ని థియేట‌ర్ల‌లో పుష్ప‌2 ప్ర‌ద‌ర్శితం అవుతోంది. 

కానీ, భాగ్య‌న‌గ‌రంలో ఎంతో ఫేమ‌స్ అయిన‌ ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. గ‌త నాలుగు రోజులు నుంచి అభిమానులు కూడా ప్రసాద్స్‌లో ఎప్పుడు బుకింగ్ ఓపెన్ అవుతుందా? ఎప్పుడు టికెట్స్ బుక్ చేద్దామా అని ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు బుకింగ్స్ ఓపెన్ కాలేదు. 

ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో పుష్ప‌2 ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటంటే..?
ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్ యాజ‌మాన్యానికి ‘పుష్ప 2’ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేకర్స్‌కి ఇంకా డీల్ సెట్ అవ్వ‌లేద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌సాద్ నుంచి ఎక్కువ షేర్ మైత్రి నిర్మాత‌లు అడిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా గ్రాస్ క‌లెక్ష‌న్‌కి సంబంధించి 55 శాతం డిస్ట్రిబ్యూటర్‌కి ఇవ్వాల‌ని మైత్రి వారు ప్ర‌తిపాదించారు. పీవీఆర్‌తో పాటు సినీపోలీస్, ఏషియ‌న్ సినిమాలు దీనికి అంగీక‌రించాయి కూడా. 

అయితే, ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌ యాజ‌మాన్యం మాత్రం 52 శాతమే షేర్‌గా ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అయితే మైత్రి మేక‌ర్స్ వాళ్లు ఆ 3 శాతం కూడా ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో ప్ర‌సాద్స్ యాజ‌మాన్యం అంగీకరించడం లేదు. ఒకవేళ ఈ ప‌ర్సంటేజ్‌ని పెంచితే ప్ర‌తి సినిమాకి ఇలానే ఇవ్వాల్సి ఉంటుంద‌ని ప్రసాద్స్ ఆలోచించిన‌ట్లు స‌మాచారం. 


More Telugu News