హైదరాబాదీ పేసర్ సిరాజ్‌పై సునీల్ గవాస్కర్ విమర్శలు

  • సెంచరీ హీరో ట్రావిస్‌ హెడ్‌కు ఆగ్రహంతో సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న మాజీ దిగ్గజం
  • అతడేమైనా 1 లేదా 2 పరుగులు చేశాడా అని ప్రశ్న
  • సిరాజ్ చప్పట్లు కొట్టి ఉంటే బావుండేదన్న సునీల్ గవాస్కర్
అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణించాడు. 140 పరుగులతో అదరగొట్టాడు. టెస్టుల్లో వన్డే తరహా బ్యాటింగ్ చేసిన అతడిని భారత పేసర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపించాడు. చక్కటి ‘లో ఫుల్ టాస్’ బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సిరాజ్ ఎగిరి గంతేశాడు. ఆనందంతో కూడిన ఆవేశానికి లోనయ్యాడు. ట్రావిస్‌ హెడ్‌కు కోపంతో పెవిలియన్‌ వైపు దారి చూపించాడు. దీంతో హెడ్ కూడా తిట్టుకుంటూ మైదానాన్ని వీడాడు. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. అయితే మహ్మద్ సిరాజ్ ప్రవర్తనను భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుబట్టారు.

అద్భుతంగా ఆడి 140 పరుగులు సాధించిన ఆటగాడిగా ఈ తరహాలో కోపంతో సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. సిరాజ్ ఈ విధంగా ప్రవర్తించడం అనవసరమని విమర్శించారు.  ‘‘ నన్ను అడిగితే ఇలాంటి సెండ్ ఆఫ్ అనవసరం. అతడు 140 పరుగులు సాధించాడు. అతనేమీ ఒకటి లేదా రెండు పరుగులు చేసి ఔట్ కాలేదు కదా. అద్భుతంగా బ్యాటింగ్ చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బ్యాటర్‌కు ఎవరూ ఈ విధంగా సెండ్-ఆఫ్ ఇవ్వరు. హెడ్‌ని ఔట్ చేసిన సిరాజ్ హీరోగా కాకుండా విలన్‌గా మారాడు. పైగా తన చర్యలతో స్థానిక ప్రజల గౌరవాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ అవుట్ తర్వాత హెడ్‌ని అభినందిస్తూ సిరాజ్ చప్పట్లు కొట్టి ఉంటే స్టేడియంలోని ప్రతి ఒక్కరికీ అతడు కూడా హీరో అయ్యేవాడు. అయితే అందుకు విరుద్ధంగా సిరాజ్ విమర్శల పాలవుతున్నాడని అర్థం చేసుకోవచ్చు’’ అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ కూడా సిరాజ్ చర్యలను తప్పుబట్టాడు. బౌలర్‌గా వికెట్ తీయడం ఎవరికైనా సంతోషకరమే, అయితే సిరాజ్ కొంచెం భావోద్వేగానికి గురైనట్టుగా అనిపిస్తోందని విమర్శించాడు. 140 పరుగులు చేసిన లోకల్ ఆటగాడైన ట్రావిస్ హెడ్‌ని ఎదుర్కొనేటప్పుడు కాస్త వినయం చూపాలి కదా అని హెడెన్ సలహా ఇచ్చాడు. హెడ్ ప్రదర్శనను హెడెన్ మెచ్చుకున్నాడు.


More Telugu News