ఢిల్లీలో పుష్ప-2 స్టైల్ పోస్టర్లతో ఆప్, బీజేపీ మధ్య వార్

  • ఢిల్లీలో సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు
  • 'కేజ్రీవాల్ తగ్గేదే లే' అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్
  • అవినీతిపరులను అంతం చేస్తామంటూ బీజేపీ కౌంటర్ పోస్టర్
ఢిల్లీలో పుష్ప-2 సినిమా స్టిల్స్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో దేశ రాజధానిలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో కేజ్రీవాల్ ఫొటోతో కూడిన ఓ పోస్టర్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. 'కేజ్రీవాల్ ఝుకేగా నహీ'... (తగ్గేదేలే) అంటూ పుష్ప-2 స్టైల్లో పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో హీరో అల్లు అర్జున్ స్టైల్లో కేజ్రీవాల్ చీపురు పట్టుకొని ఉన్నాడు.

ఆమ్ ఆద్మీ పోస్టర్‌కు ధీటుగా బీజేపీ స్పందించింది. పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌తో కూడిన పోస్టర్‌ను పుష్ప స్టైల్లోనే విడుదల చేసింది. 'అవినీతిపరులను అంతం చేస్తాం.. రప్పా... రప్పా' అని రాసి ఉన్న పోస్టర్‌ను బీజేపీ విడుదల చేసింది. కాగా, ఢిల్లీలో 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వస్తోంది. 2013 తర్వాత 2015, 2020లలో గెలిచింది.


More Telugu News