జైలు అధికారులపై హోంమంత్రి అనిత మండిపాటు

  • జైలులో టీవీలు, ఫ్రిజ్‌ కొనుగోలు చేయడంపై మంత్రి అనిత ఆరా
  • ఈ కొనుగోళ్లపై విచారణ జరుగుతోందని మంత్రి వెల్లడి
  • బాధ్యులని తేలిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్న మంత్రి 
విజయవాడ జైలు అధికారులపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో టీవీలు, ఫ్రిజ్‌లు కొనుగోలు చేసి జైలులో ఏర్పాటు చేయడంపై మంత్రి ఆరా తీశారు. 

వెంకటరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో కొత్త ఫ్రిజ్, టీవీలు ఎందుకు కొన్నారు? ఆ సమయంలో ఏమి జరిగింది? ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారు..? ఎప్పుడూ లేనిది ఆ సమయంలోనే ఎందుకు హడావుడిగా కొని జైలుకు తరలించారు? అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అవినీతిపరులకు కొమ్ముకాసి .. మీ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవద్దు అంటూ ఆమె హెచ్చరించారు. 

అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ .. వెంకటరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో కొన్ని వస్తువులు జైలుకు వెళ్లాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టామని తెలిపారు. టీవీలు, ఫ్రిజ్ కావాలని ముందే ఇండెంట్ పెట్టారా ? లేక అప్పటికప్పుడు పెట్టారా? అన్న విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. విచారణ మూడు రోజుల్లో పూర్తవుతుందని, బాధ్యులని తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


More Telugu News