పేలుడు పదార్ధాలతో ఉన్న ఆర్మీ కంటైనర్‌ను ఢీకొన్న లారీ

  • బాపట్ల జిల్లా మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 
  • ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు
  • 108 అంబులెన్స్‌లో ఒంగోలు ఆసుపత్రికి తరలింపు
పేలుడు పదార్ధాలతో ఉన్న ఆర్మీ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగిన ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో బుధవారం వేకువ జామున జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. 

పోలీసుల సమాచారం మేరకు.. మహారాష్ట్ర నుంచి ఆర్మీకి సంబంధించిన పేలుడు పదార్ధాలతో 18 కంటైనర్లు చెన్నైకి బయలుదేరాయి. బొడ్డువానిపాలెం సమీపంలోని పెట్రోల్ బంకులో ఆయిల్ నింపుకుంటున్న క్రమంలో ఆర్మీ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుదల చేశారు. ఈ క్రమంలో బియ్యం లోడుతో చెన్నై వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్మీ కంటైనర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో లారీకి మంటలు వ్యాపించాయి. 

లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే సమీపంలోని వారు స్పందించి ఇళ్లలోని నీళ్లను బకెట్లతో తీసుకువచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో అద్దంకి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గంటకు పైగా కష్టపడి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. 
 
అద్దంకి రూరల్ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని ఆర్మీ అధికారులతో మాట్లాడారు. వాహనాల్లో పేలుడు పదార్ధాలు ఉండటంతో వాహనానికి 100 మీటర్ల దూరంలో ఎవరినీ ఉండకుండా చూడాలని సీఐకి ఆర్మీ అధికారులు సూచించారు. ఈ ఘటనపై మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News