ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు.. 400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరిన తొలి శ్రీమంతుడు!

  • మ‌స్క్ సంపాద‌న 439.2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్ సూచీ వెల్ల‌డి
  • స్పేస్‌ ఎక్స్‌ లోని అంతర్గత వాటా విక్రయంతో దాదాపు 50 బిలియన్‌ డాలర్లు పెరిగిన సంపాద‌న‌
  • అమెరికా ఎన్నికల ఫలితాల త‌ర్వాత మ‌స్క్ సంపాద‌న‌కు ఒక్క‌సారిగా రెక్క‌లు
  • ట్రంప్‌ విజయం అనంతరం టెస్లా స్టాక్స్‌ దాదాపు 65 శాతం పెరిగిన వైనం
స్పేస్‌ ఎక్స్‌,టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌ లోకి చేరారు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. తాజాగా స్పేస్‌ ఎక్స్‌ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్‌ డాలర్లు పెరిగి 439.2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్ సూచీ వెల్ల‌డించింది.

2022 చివ‌ర‌లో మ‌స్క్ సంపాద‌న నిక‌ర విలువ‌ 200 బిలియన్‌ డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అయితే, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఫలితాల త‌ర్వాత మ‌స్క్ సంపాద‌న‌కు ఒక్క‌సారిగా రెక్క‌లొచ్చాయి. ట్రంప్‌ విజయం అనంతరం టెస్లా స్టాక్స్‌ దాదాపు 65 శాతం పెరిగాయి. 

దీంతో మస్క్‌ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇక ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన మస్క్‌.. ట్రంప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. దాంతో ట్రంప్‌ తన మంత్రివ‌ర్గంలో మస్క్‌ కు కీలక పదవి కూడా ఇచ్చారు. 

అలాగే ట్రంప్‌ విజయంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను క్రమబద్ధీకరిస్తారని, టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రిక్‌ వాహనాలపై టాక్స్‌ క్రెడిట్‌ లను ఆయ‌న‌ తొలగిస్తార‌ని మార్కెట్‌ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయని బ్లూమ్‌ బర్గ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టెస్లా స్టాక్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. మస్క్‌ కు చెందిన ఆర్టిఫిషియల్‌ స్టార్టప్‌ ఎక్స్‌ ఏఐ గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ రెండింతలై 50 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక బుధవారం స్పేస్‌ ఎక్స్‌, దాని పెట్టుబడిదారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. త‌ద్వారా 1.25 బిలియన్‌ డాలర్ల విలువ గల షేర్లను స్పేస్‌ ఎక్స్‌ ఉద్యోగులు, కంపెనీ ఇన్‌ సైడర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. 

దీంతో స్పేస్‌ ఎక్స్‌ 350 బిలియన్‌ డాలర్ల విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్‌ స్టార్టప్‌ గా స్పేస్‌ ఎక్స్‌ రికార్డు సృష్టించింది. ఇక స్పేస్‌ ఎక్స్‌ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ట్రంప్ పదవీకాలంలో కంపెనీకి భారీ మ‌ద్ద‌తు ల‌భించే అవకాశం ఉంది.

ఇక ఎన్నిక‌ల ప్రచారం సమయంలో అంగారక గ్రహంపైకి వ్యోమగాములను పంపించే మస్క్ ప్ర‌తిపాద‌న‌కు ట్రంప్‌ మద్దతు ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత టెక్సాస్‌లో జరిగిన స్పేస్‌ఎక్స్ లాంచ్‌లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలాన్ మస్క్‌తో కలిసి పాల్గొన్నారు. 


More Telugu News