అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా.. ఐదుగురి మృతి!

  • విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో క్రైస్తవ పాఠశాలలో కాల్పుల ఘ‌ట‌న‌
  • ఐదుగురి మృతి.. మ‌రో ఐదుగురికి గాయాలు 
  • మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారన్న‌ అధికారులు
  • సుమారు 400 మంది విద్యార్థులు ఉండే అబండెంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ ఘ‌ట‌న‌
అమెరికాలో మ‌రోసారి కాల్పులు చోటు చేసుకోవ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లోని క్రైస్తవ పాఠశాలలో సోమవారం జరిగిన కాల్పుల్లో అనుమానిత షూటర్‌ సహా ఐదుగురు చనిపోయారు. మ‌రో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉండే అబండెంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ ఘ‌ట‌న‌ జరిగినట్లు మాడిసన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో తెలిపింది.

మాడిసన్ పోలీసు చీఫ్ షాన్ బర్న్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ సంఘటనలో కనీసం ఐదుగురు చ‌నిపోయారని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు 12వ త‌ర‌గ‌తి చదువుతున్న ఓ విద్యార్థి కార‌ణ‌మైన‌ట్లు గుర్తించామ‌న్నారు. అలాగే గాయప‌డిన ఐదుగురిని చికిత్స కోసం ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు బర్న్స్ పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై మాడిస‌న్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఇక ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో మ‌రోసారి అమెరికాలో తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రతపై ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. అగ్ర‌రాజ్యంలో ఇటీవలి కాలంలో పాఠశాలలో కాల్పుల సంఖ్య పెరిగింది. కే-12 స్కూల్ షూటింగ్ డేటాబేస్ వెబ్‌సైట్ ప్రకారం.. అమెరికాలో ఈ ఏడాది 322 పాఠశాలలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. 1966 నుంచి చూస్తే, ఇది రెండవ అత్యధికం. గ‌తేడాది మొత్తం 349 కాల్పుల ఘటనలతో అగ్రస్థానంలో ఉంది.


More Telugu News