రేపు ఓటీటీకి వస్తున్న మలయాళ హిట్ మూవీ!

  • మలయాళంలో రూపొందిన 'కడకన్'
  • మార్చిలో విడుదలైన సినిమా 
  • ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే కథ 
  • రేపటి నుంచి 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానున్న సినిమా 


మలయాళంలో ఈ ఏడాది థియేటర్స్ దగ్గర సందడి చేసిన సినిమాల జాబితాలో 'కడకన్' ఒకటిగా కనిపిస్తుంది. సాజిల్ మాంపాడ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా, ఈ ఏడాది మార్చిలో థియేటర్స్ కి వచ్చింది. గట్టిపోటీ ఉన్న సమయంలో విడుదలైన ఈ సినిమా, ఆ పోటీని తట్టుకుని నిలబడి మంచి వసూళ్లను రాబట్టడం విశేషం.

హకీమ్ షాజహాన్, రంజిత్, శరత్ సభా, జాఫర్ ఇడుక్కి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సన్ నెక్స్ట్'వారు దక్కించుకున్నారు. రేపటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇసుక మాఫియా నేపథ్యంలో నడిచే కథ ఇది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. 

కథ విషయానికి వస్తే... సుల్ఫీ-మణి ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కూడా ఇసుక మాఫియా వైపుకు వెళతారు. ఆ ఆధిపత్య పోరులో శత్రువులుగా మారతారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మి పట్ల సుల్ఫీ ఇష్టాన్ని పెంచుకుంటాడు. తనని ప్రేమిస్తే ఇసుక మాఫియాను వదిలేయవలసి ఉంటుందని లక్ష్మి అంటుంది. అలాగే వదిలేస్తానని ఆమెకి అతను మాట ఇస్తాడు. అయితే అదే సమయంలో ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? లక్ష్మికి ఇచ్చిన మాటను అతను నిలబెట్టుకున్నాడా లేదా? అనేది కథ.    



More Telugu News