వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలతో ఉత్తరాంధ్రలో మునిగిన వేలాది ఎకరాలు
- రెండ్రోరోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం
- కోసిపెట్టిన వరికుప్పలు వర్షార్పణం
- వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
- నేడు వర్షాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం
- పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. పొలాల్లో కోసి ఉంచిన వరి కుప్పలు తడిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం తాజాగా వాయుగుండంగా బలపడినట్టు వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని వేలాది హెక్టార్లలో వరిపొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు ఎగురవేశారు. భారీ వర్షాల కారణంగా కొత్తవలస-కిరండూల్ రైలుమార్గంలో బొర్రా స్టేషన్ సమీపంలో పట్టాలపై బండరాళ్లు జారిపడడంతో విశాఖ నుంచి అరకు వెళ్తున్న గూడ్సు రైలులో ఒక బోగీ పట్టాలు తప్పింది.