మరియమ్మ హత్య కేసు.. నందిగం సురేశ్‌కు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

  • నందిగం బెయిలు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • పోటాపోటీగా వాదనలు వినిపించిన కపిల్ సిబల్, సిద్ధార్థ లూథ్రా
  • మరియమ్మ హత్యకేసుతో సురేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్న కపిల్ సిబల్
  • 36 మందిని నిందితులుగా చేర్చి సురేశ్‌ను ఒక్కరినే ఎందుకు చేర్చలేదని ప్రశ్నించిన కోర్టు
  • చార్జ్‌షీట్ దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోమని స్పష్టీకరణ
  • పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం కావాలన్న కపిల్ సిబల్
  • తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా
దళిత మహిళ మరియమ్మ హత్య కేసు నిందితుడు, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చార్జ్‌షీట్ దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు పూర్తి సమయం ఇవ్వాలన్న నందిగం తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. 27 డిసెంబర్ 2020లో మరియమ్మ హత్య జరిగింది. ఈ కేసులో బెయిలు కోసం నందిగం సురేశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నిన్న విచారణ జరిగింది. సురేశ్ తరపున కపిల్ సిబల్, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మరియమ్మ హత్య కేసుతో సురేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని, దళితుల్లోని రెండు వర్గాల మధ్య అల్లర్లకు ఉసిగొల్పినట్టు ఆరోపిస్తున్నా ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు నిరూపించే ఒక్క సాక్షి కూడా లేరని సురేశ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌ను ఇరికించేందుకే ఈ కేసు పెట్టారని తెలిపారు.

డబ్బు, మద్యంతో రెచ్చగొట్టారు
ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తన వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్‌లో పిటిషనర్ పేరు ఆరుసార్లు ఉన్నట్టు చెప్పారు. అల్లర్లకు వ్యూహకర్త ఆయనేనని, అనుచరులకు డబ్బు, మద్యం ఇచ్చి మారణాయుధాలతో దాడికి ఉసిగొల్పారని తెలిపారు. దాడిలో పాల్గొన్న 36 మందిని పోలీసులు గుర్తించినట్టు పేర్కొన్నారు. నిందితుడిపై హత్య, హత్యాయత్నం వంటి 9 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు దర్యాప్తును ప్రభావితం చేశారని ఆరోపించారు.

అధికారంలో ఉండడం వల్లే పేరు తప్పించారా?
వాదోపవాదాల అనంతరం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ ‌కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బెయిలు ఇచ్చేందుకు విముఖత చూపింది. ఎఫ్ఐఆర్‌లో అందరినీ నిందితులుగా చేర్చి మిమ్మల్ని (సురేశ్)ను మాత్రమే మినహాయించడానికి కారణమేంటని ప్రశ్నించింది. మీ పార్టీ అధికారంలో ఉండటం వల్లే ఎఫ్ఐఆర్ నుంచి తప్పించారని అభిప్రాయపడింది. బెయిలు పిటిషన్‌లో పాత కేసుల వివరాలు ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సురేశ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ కల్పించుకుని పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరగా తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.


More Telugu News