అమెరికా పౌర‌స‌త్వం.. రెండో స్థానంలో భార‌తీయులు!

  • అంత‌కంత‌కూ పెరుగుతున్న అమెరికా పౌర‌స‌త్వం తీసుకుంటున్న భార‌తీయుల సంఖ్య
  • ఈ ఏడాది 49,700 మంది భార‌తీయుల‌కు అమెరికా పౌర‌స‌త్వం   
  • కొత్తగా పౌర‌సత్వం పొందిన వారిలో 6.1 శాతం వాటా భార‌తీయుల‌దే 
  • 13.1 శాతం వాటాతో అగ్ర‌స్థానంలో మెక్సికో  
అమెరికా పౌర‌స‌త్వం తీసుకుంటున్న భార‌తీయుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌర‌స‌త్వం పొందిన విదేశీయుల్లో మ‌నోళ్లు రెండో స్థానాన్ని ఆక్ర‌మించారు. యూఎస్ సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్‌ డేటా ప్ర‌కారం ఈ ఏడాది 49,700 మంది భార‌తీయులు అమెరికా పౌర‌స‌త్వం పొందారు. 

త‌ద్వారా కొత్తగా పౌర‌సత్వం పొందిన వారిలో 6.1 శాతం వాటా భార‌తీయుల‌దే కావ‌డం గ‌మ‌నార్హం. అత్య‌ధికంగా మెక్సికో 13.1 శాతం వాటాతో అగ్ర‌స్థానంలో ఉంది. మ‌నోళ్లు రెండో స్థానంలో ఉన్నారు. మ‌న త‌ర్వాత ఫిలిప్పీన్స్‌, డొమినిక‌న్ రిప‌బ్లిక్‌, వియ‌త్నాం ఉన్నాయి. ఈ ఏడాది పౌర‌స‌త్వం పొందిన వివిధ దేశీయుల్లో ఈ ఐదింటి వాటానే 33 శాతం కావ‌డం గ‌మ‌నార్హం.  

కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌర‌స‌త్వం పొందిన భార‌తీయుల్లో 70 శాతం మంది అక్క‌డి 10 రాష్ట్రాల్లోనే ఉన్న‌ట్లు యూఎస్ సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్ లెక్క‌లు చెబుతున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్‌, టెక్సాస్‌, న్యూజెర్సీ, ఇల్లినాయిస్‌, వ‌ర్జీనియా, జార్జియా, మ‌సాచుసెట్స్, వాషింగ్ట‌న్ ఈ ప‌ది రాష్ట్రాల్లోనే మ‌నోళ్లు 70 శాతం ఉన్నారు. 

అమెరికా పౌర‌స‌త్వం పొందిన భార‌తీయుల్లో చాలామంది కుటుంబ ప్రాయోజిత‌, ఉపాధి ఆధారిత కేట‌గిరీల‌కు చెందినవారు ఉన్నారు. వీరితో పాటు శ‌ర‌ణార్థులుగా, డైవ‌ర్సిటీ ఇమ్మిగ్రేంట్ వీసా ప్రోగ్రామ్ ద్వారా అక్క‌డికి వెళ్లిన‌వారు ఉన్న‌ట్లు డేటా చెబుతోంది. 

కాంగ్రెష‌న‌ల్ రీసెర్చ్ స‌ర్వీస్ (సీఆర్ఎస్‌) ప్ర‌కారం 2022లో 65,960 మంది భార‌తీయులు అమెరికా పౌర‌స‌త్వం తీసుకున్నారు. అలాగే 1,28,878 మంది మెక్సిక‌న్లు, 53,413 మంది ఫిలిపినోలు, 46,913 మంది క్యూబ‌న్లు యూఎస్ సిటిజ‌న్‌షిప్ పొందిన‌ట్లు సీఆర్ఎస్‌ నివేదిక పేర్కొంది. కాగా, అగ్ర‌రాజ్యంలో 2024 నాటికి భార‌తీయ‌-అమెరిక‌న్ జ‌నాభా 50ల‌క్ష‌ల‌కు దాటిపోయిన‌ట్లు తెలుస్తోంది. 


More Telugu News