కర్ణాటకలో సీడబ్ల్యూసీ సమావేశం... రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం

  • వచ్చే ఏడాది జనగణనలో కులగణన కూడా చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన
  • సీడబ్ల్యూసీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సూచన
  • నియోజకవర్గాల పెంపులో దక్షిణాదికి నష్టం జరగకుండా చూడాలన్న సీఎం
జనగణనలో కులగణన కూడా చేయాలన్న తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కర్ణాటకలోని బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.

సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని, జనాభా ప్రాతిపదికన జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల తగ్గుదల ఉంటుందన్నారు. అప్పుడు దక్షిణాది నష్టపోయే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ విషయంపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచన చేయాలన్నారు.

నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. చట్టసభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్ హయాంలోనే తీసుకొచ్చామని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలన్నారు. మహిళా బిల్లుతో బీజేపీ తమకు అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని, ఈ విషయంలో పార్టీ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

తెలంగాణలోని కులగణన దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. వచ్చే ఏడాది కేంద్రం చేయనున్న జనగణనలో కులగణన కూడా ఉండాలని, ఈ దిశగా కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలన్నారు. ఇందుకు అనుగుణంగా సీడబ్ల్యూసీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు.


More Telugu News