దుబాయిలో వాచ్‌మెన్‌గా చేస్తున్న హైద‌రాబాదీకి జాక్‌పాట్‌.. లాటరీలో రూ. 2.32 కోట్లు!

  • 30 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్న హైద‌రాబాదీ రాజ‌మ‌ల్ల‌య్య
  • ఇటీవ‌ల తీసిన బిగ్ టికెట్ మిలియ‌నీర్ ఎల‌క్ట్రానిక్‌ ల‌క్కీ డ్రాలో అత‌నికి జాక్‌పాట్‌
  • త‌న‌కు ద‌క్కిన భారీ న‌గ‌దు బ‌హుమ‌తిని స్నేహితుల‌తో పంచుకుంటాన‌ని వెల్ల‌డి
దుబాయిలో వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్న హైద‌రాబాదీకి జాక్‌పాట్ త‌గిలింది. ఇటీవ‌ల తీసిన బిగ్ టికెట్ మిలియ‌నీర్ ఎల‌క్ట్రానిక్‌ ల‌క్కీ డ్రాలో ఏకంగా మిలియ‌న్ దిర్హ‌మ్స్ (రూ. 2.32కోట్లు) గెలుచుకున్నాడు. హైద‌రాబాద్‌కు చెందిన రాజ‌మ‌ల్ల‌య్య (60)కు ఈ బంప‌ర్ లాట‌రీ త‌గిలింది. దీంతో అత‌ని ఆనందానికి అవ‌ధుల్లేవు. 

హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లికి చెందిన రాజ‌మ‌ల్ల‌య్య గ‌త 30 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. అత‌ని భార్య‌, పిల్ల‌లు ఇక్క‌డే ఉండ‌గా.. ఒంట‌రిగానే అక్క‌డ ఉంటూ, ఫ్యామిలీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు. నాలుగేళ్ల క్రితం స్నేహితుల ద్వారా ఈ బిగ్ టికెట్ మిలియ‌నీర్ లాట‌రీ గురించి తెలుసుకున్నాడు. అప్ప‌టి నుంచి మిత్రుల‌తో క‌లిసి లాట‌రీ టికెట్ కొనుగోలు చేయ‌డం ప్రారంభించాడు. ఇప్పుడు అదృష్టం వ‌రించ‌డంతో ఏకంగా రూ. 2.32 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో రాజ‌మ‌ల్లయ్య సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నాడు. 

రాజ‌మ‌ల్ల‌య్య మాట్లాడుతూ.. "నేను ఇంత‌కుముందు కొన్నిసార్లు టికెట్ కొనుగోలు చేశాను. కానీ మ‌ధ్య‌లో మానేశాను. రెండు నెలల క్రితం మళ్లీ టిక్కెట్లు కొనడం ప్రారంభించాను. లాటరీ నిర్వాహ‌కుల నుంచి మొద‌ట కాల్ వచ్చినప్పుడు, నేను పూర్తిగా ఆనందంలో మునిగిపోయాను. ఆ స‌మ‌యంలో నేను అనుభవించిన ఆనందాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను. 

ఇది నా మొదటి విజయం. ఈ న‌గ‌దు బహుమతిని నా స్నేహితులతో పంచుకుంటాను. నా వాటాగా వ‌చ్చే సొమ్మును నా కుటుంబం భవిష్యత్తు కోసం ఉప‌యోగిస్తాను. ఇక‌పై కూడా లాటరీ టికెట్ కొన‌డం కొనసాగిస్తాను" అని చెప్పుకొచ్చాడు.




More Telugu News