స్టుపిడ్... రిషబ్ పంత్ ఔటైన విధానంపై లైవ్‌లోనే తిట్టేసిన సునీల్ గవాస్కర్.. వీడియో ఇదిగో!

  • స్కూప్ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయిన రిషబ్ పంత్
  • ఇద్దరు ఫీల్డర్లు ఉన్నా షాట్ ఆడడంపై మండిపడిన గవాస్కర్ 
  • ఇలాంటి షాట్ ఆడే స్థితిలో జట్టు లేదంటూ ఆగ్రహం 
క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భారత జట్టు ఎల్లప్పుడూ రాణించాలని ఆకాంక్షిస్తుంటారు. ఆటగాళ్లలోని లోపాలను ఎత్తిచూపుతూ సలహాలు, సూచనలు చేస్తుంటారు. కామెంటరీ చెబుతూ అటు క్రికెటర్లు, ఇటు అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. ఇక ఆటగాళ్లు తప్పిదాలు చేస్తే నిర్మొహమాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కూడా ఇలాంటి ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది.

ఆట మూడో రోజు ప్రారంభంలోనే స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఔట్ అయిన విధానంపై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్ పేసర్ బోలాండ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌ దిశలో స్కూప్ షాట్ కోసం ప్రయత్నించి పంత్ వెనుదిరిగాడు. భారత్ ఇన్నింగ్స్ 56వ ఓవర్‌లో నాలుగో బంతిని స్కూప్ షాట్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి థర్డ్ మ్యాన్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ లియాన్ చేతిలో పడింది. అతడు ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్‌ను అందుకున్నాడు.

రిషబ్ పంత్ ఔట్ కావడంతో అసలే కష్టాల్లో ఉన్న భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. దీంతో రిషబ్ ఔట్ అయిన తీరుపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు లైవ్ కామెంటరీలో విమర్శలు గుప్పించారు. షాట్ ఎంపిక చాలా చెత్తగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షాట్ ఆడాల్సిన స్థితిలో భారత జట్టు లేదని అన్నారు.

రిషబ్ పంత్ ఔట్ కావడం జట్టుకి గట్టి ఎదురుదెబ్బ అని, ఆస్ట్రేలియా జట్టుకు సానుకూలంగా మారుతుందని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ‘‘ఆ దిశలో ఇద్దరు ఫీల్డర్లు ఉన్నప్పటికీ ఆ షాట్ ఆడడం చెత్త పని. నీ వికెట్‌ని నువ్వే పడగొట్టుకున్నావు. నువ్వు ఇలాంటి షాట్లు ఆడే స్థితిలో టీమిండియా లేదు. పరిస్థితిని అర్థం చేసుకొని ఆడాలి. ఇది నా సహజ సిద్ధమైన ఆట అని నువ్వు చెప్పకూడదు. ఐయామ్ సారీ. నువ్వు నేచురల్ గేమ్ ఆడే మ్యాచ్ ఇది కాదు’’ అని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


More Telugu News