నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద నాటకీయ పరిణామాలు

  • నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది
  • ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం ఉదయం తెలంగాణ వైపు నుంచి తప్పుకున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది
  • మరల ఆదేశాలు రావడంతో శనివారం సాయంత్రానికి భద్రతా విధులు చేపట్టిన సీఆర్‌పీఎఫ్
నాగార్జునసాగర్ డ్యామ్ (నీటి పారుదల ప్రాజెక్టు) వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ జల వివాదం నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను సీఆర్‌పీఎఫ్‌కు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అప్పగించిన విషయం తెలిసిందే. ఇరువైపులా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అయితే, శనివారం కీలక పరిణామాలు జరిగాయి. 

తెలంగాణ వైపు భద్రత విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు పర్యవేక్షణ బాధ్యతలను అకస్మాత్తుగా ఉపసంహరించుకున్నాయి. వారి స్థానంలో ఎస్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అకస్మాత్తుగా సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉపసంహరణపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అదే సమయంలో డ్యామ్ వద్ద విధుల్లో కొనసాగాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో తెలంగాణ వైపు మళ్లీ సీఆర్‌పీఎఫ్ బలగాలు బాధ్యతలు చేపట్టాయి. 

ఈ విషయంపై డ్యామ్ ఏఈ శ్రీధర్‌ రావును మీడియా వివరణ కోరగా.. సీఆర్‌పీఎఫ్ బందోబస్తు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, ఆ విషయాన్ని కేఆర్ఎంబీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. సీఆర్‌పీఎఫ్ సహాయ కమాండెంట్ సహీర్‌ను ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం డ్యామ్‌ వద్ద నుంచి భద్రతను ఉపసంహరించామని, తిరిగి సాయంత్రం విధుల్లోకి చేరినట్లు తెలిపారు. ఈ నాటకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమన్నాయి.  


More Telugu News