న్యూఇయర్ పార్టీలకు సిద్ధమవుతున్న యువతకు తెలంగాణ పోలీసుల ప్రశ్న

  • మీ న్యూఇయర్ రిజల్యూషన్ ఏమిటని ప్రశ్నించిన తెలంగాణ పోలీస్ 
  • డ్రంకెన్ డ్రైవింగ్ చేయబోమంటూ తీర్మానం చేసుకోండంటూ సలహా 
  • దీనివల్ల మీతో పాటు ఎదుటివారికీ న‌ష్ట‌మేనని వెల్లడి 
మరికొన్ని గంటల్లోనే 2024 సంవత్సరం చరిత్రలో కలిసిపోనుంది. నూతన సంవత్సరం 2025కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా యువత ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పార్టీలకు ఏర్పాట్లు చేసుకున్నారు. పబ్‌‌లు, రెస్టారెంట్లు, హోటల్స్ కూడా రకరకాల ఆఫర్లు ప్రకటించి సెలబ్రేషన్స్‌కు తయారుగా ఉన్నాయి. అయితే, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో మందుబాబుల హడావుడి కాస్త ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పోలీసులు యువతను అప్రమత్తం చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు

‘మీ న్యూఇయర్ రిజల్యూషన్ ఏంటి?’ అని తెలంగాణ పోలీస్ విభాగం అడిగింది. డ్రంకెన్ డ్రైవింగ్ చేయబోమంటూ ఈ ఏడాది తీర్మానంగా తీసుకోవాలని సూచించింది. స్నేహితులు, బంధువులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసింది. నూతన సంవత్సరం 2025ను ఆనందంగా ఆరంభించాలని తెలంగాణ పోలీసు విభాగం అభిలాషించింది. ‘‘డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తే మీతో పాటు ఎదుటివారికీ న‌ష్ట‌మే. మీరు చేసే పొర‌పాటు కొన్ని కుటుంబాల‌ను చిదిమేస్తుంది. డ్రంకెన్ డ్రైవింగ్ చేయ‌న‌ని కొత్త సంవ‌త్స‌రం రిజల్యూషన్ తీసుకోండి’’ అని ఎక్స్ వేదికగా పోలీసులు ఈ పోస్ట్ పెట్టారు.


More Telugu News