'అన్‌స్టాపబుల్‌' షో షూటింగ్‌లో పాల్గొన్న రామ్‌చ‌ర‌ణ్‌.. ఇవిగో ఫొటోలు!

  • బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోకు గ్లోబ‌ల్ స్టార్‌
  • అధికారికంగా ప్రకటించిన‌ ఆహా 
  • ఈ టాక్ షో షూటింగ్ స్పాట్‌లో చ‌ర‌ణ్ హ‌ల్‌చ‌ల్‌
  • ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో వైర‌ల్‌
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ప్ర‌ముఖ‌ టాక్ షో అన్‌స్టాపబుల్‌కు ఎంత‌టి ప్ర‌జాద‌ర‌ణ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన‌శైలిలో గెస్టుల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తూ బాల‌య్య అద‌రగొడుతుంటారు. ఇప్ప‌టికే మూడు సీజ‌న్లు పూర్తి చేసుకున్నీ ఈ టాక్ షో.. ఇటీవ‌లే నాలుగో సీజ‌న్ ప్రారంభించింది. ఇక ఈ షోలో తమ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ప్రముఖ నటులు విచ్చేసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేశ్, అనిల్ రావిపూడి, నిర్మాత సురేశ్ బాబు పాల్గొని సందడి చేశారు. 

ఇక ఈ టాక్ షోలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా సంద‌డి చేయ‌బోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ విషయమై కీలక అప్ డేట్ కూడా వచ్చింది. 'ఆహా' ఓటీటీ సంస్థ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా అధికారిక ప్రకటన చేసింది. 'ఒరేయ్ చిట్టి .. బాబు వస్తున్నాడు .. రీసౌండ్ ఇండియా అంతా వినిపించేలా చేయండి' అంటూ ఆహా 'ఎక్స్' ద్వారా ప్ర‌క‌టించింది. దీంతో నందమూరి, మెగా అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, జనవరి 10న విడుద‌ల‌వుతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్‌లో భాగంగా చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు స‌మాచారం. 

ఇక రామ్ చ‌ర‌ణ్ ఈ టాక్ షో షూటింగ్‌కి వెళ్తున్న ఫొటోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. త‌న కారు నుంచి దిగి షూటింగ్ లో పాల్గొనేందుకు గ్లోబ‌ల్ స్టార్ వెళ్తుండ‌డం ఫొటోల్లో ఉంది. ఈ సంద‌ర్భంగా అక్క‌డి వారికి రామ్ చ‌ర‌ణ్ అభివాదం చేయ‌డం ఫొటోల్లో క‌నిపించింది. దీంతో నందమూరి, మెగా అభిమానులు ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్ర‌సారం అవుతుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  



More Telugu News