వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరం

  • తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
  • భక్తులు భారీగా తరలివస్తారని అంచనా
  • జనవరి 9 నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలలో 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 10 రోజుల పాటు సాగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం, సర్వదర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, షెడ్లు, బారికేడ్లు, తాగునీరు, టాయిలెట్లు, భద్రత తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. 

కాగా, జనవరి 10, 11, 12 తేదీల్లో  వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తిరుపతి, తిరుమలలో టోకెన్లు జారీ చేస్తారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలోని 4 కౌంటర్ల ద్వారా మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తారు. 

ఇక మిగిలిన రోజుల్లో (జనవరి 13 నుంచి 19 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కొరకు జనవరి 12, 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ స్పష్టం చేసింది. 

అదే సమయంలో, వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను అనుతించబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే మాత్రం వారిని దర్శనానికి అనుమతించనున్నారు. 

ఇక, పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ దళాల సిబ్బంది, ఎన్నారై తదితర కేటగిరీల భక్తులకు ప్రత్యేక దర్శనాలను కూడా ఈ 10 రోజుల పాటు రద్దు చేశారు.


More Telugu News