రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన మణిపూర్ ముఖ్యమంత్రి

  • జాతుల వైరంతో అట్టుడికిన మణిపూర్
  • రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలకు క్షమాపణ చెప్పిన బీరేన్ సింగ్
  • కొత్త సంవత్సరంలో కొత్త జీవితాలను ప్రారంభిద్దామని పిలుపు
జాతుల మధ్య వైరంతో మణిపూర్ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది ఎంతో కష్టంగా గడిచిపోయిందని... ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని బీరేన్ సింగ్ చెప్పారు. చాలా మంది ఇళ్లను వదిలిపెట్టి పోయారని తెలిపారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలకు క్షమాపణలు చెపుతున్నానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని... 625 మంది నిందితులు అరెస్టయ్యారని చెప్పారు. 5,600 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 

నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి నెలకొందని బీరేన్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగినంత భద్రతా సిబ్బందిని పంపిందని చెప్పారు. కొత్త సంవత్సరంలో పూర్తి స్థాయిలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన తప్పిదాలను క్షమించివేద్దామని, చేదు జ్ఞాపకాలను మర్చిపోదామని చెప్పారు. అన్ని జాతుల ప్రజలు కలసికట్టుగా జీవించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో కొత్త జీవితాలను ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు.


More Telugu News