హైదరాబాద్‌లో కూల్చివేతలు... హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

  • ఖాజాగూడ బ్రాహ్మణకుంటలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా తీరుపై ఆగ్రహం
  • నోటీసులు జారీ చేసిన 24 గంటల్లోపే కూల్చివేతలు చేపట్టడమేమిటని నిలదీత
  • ఇలాగే వ్యవహరిస్తే కమిషనర్‌ను కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరిక
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాజాగూడ బ్రాహ్మణకుంటలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించింది. నోటీసులు జారీ చేసి కనీసం 24 గంటలు కూడా గడవకముందే కూల్చివేతలు చేపట్టడమేమిటని అసహనం వ్యక్తం చేసింది.

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌కు గతంలో స్పష్టంగా చెప్పినప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే మరొకసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టారంటూ ఖాజాగూడలో హైడ్రా ఈరోజు నిర్మాణాలను కూల్చివేసింది. దీనిని సవాల్ చేస్తూ మేకల అంజయ్య, మరికొంతమంది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు.

విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోపే కూల్చివేసినట్లు హైకోర్టు గుర్తించింది. 24 గంటలే సమయం ఇస్తే ఎలా? నోటీసులు జారీ చేసిన బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని హైకోర్టు ప్రశ్నించింది. ఆక్రమణల తొలగింపుకు సంబంధించి చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించింది. మరోసారి నోటీసులు ఇచ్చి... పిటిషనర్ వివరణ తీసుకున్నాక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


More Telugu News