'తండేల్‌'కు సాయిపల్లవి కూడా మరో ధైర్యమా?

  • ఫిబ్రవరి 7న విడుదల కానున్న 'తండేల్‌' 
  • సాయి పల్లవి క్రేజ్‌ కూడా సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌ 
  • ఈ నెల 25 నుంచి ఊపందుకోనున్న ప్రమోషన్స్‌
ఈ మధ్య సైలెంట్‌గా వచ్చి సక్సెస్‌ సాధించిన తమిళ అనువాద చిత్రం 'అమరన్‌'. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎటువంటి పబ్లిసిటీ లేకుండా సైలెంట్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్‌ సాధించింది. 

ఈ చిత్రం మంచి ప్రారంభ వసూళ్లు సాధించడానికి ప్రధాన కారణం సాయి పల్లవికి తెలుగు నాట ఉన్న క్రేజేనని ట్రేడ్‌ వర్గాలు కూడా విశ్లేషించాయి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసిన సాయి పల్లవి పాప్యులారిటీ సినిమా సినిమాకు పెరుగుతూ వచ్చింది. గత కొంత కాలంగా తెలుగులో ఓ మంచి కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న శివ కార్తికేయన్‌ కూడా 'అమరన్‌'తో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. 

అయితే ఈ చిత్రం తెలుగులో సక్సెస్‌ సాధించడానికి సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న మంచి ఇమేజే కారణమని ఓపెన్‌గా ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో అందరు వక్తలూ కూడా అభిప్రాయపడ్డారు. ఇక సాయి పల్లవి తాజాగా నటిస్తున్న చిత్రం 'తండేల్‌'. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 

ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ఇక రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రం పబ్లిసిటీ ఇంకా ఊపందుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి ముంబయి, చెన్నై, కేరళలో ఈ చిత్రం ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రం విషయంలో బన్నీ వాస్‌ చాలా విశ్వాసంతో ఉన్నాడు.

ఈ చిత్రంలో హీరో నాగచైతన్యతో పాటు సాయి పల్లవి కథానాయికగా ఉండటం వల్ల ఈ సినిమాకు తప్పకుండా మంచి ప్రారంభ వసూళ్లతో పాటు ప్రేక్షకాదరణ ఉంటుందని ఆయన భావిస్తున్నాడు. సో.. ఈ చిత్రానికి నాగచైతన్యతో పాటు సాయి పల్లవి కూడా నిర్మాత బన్నీవాస్‌కు ఓ ధైర్యమే అని చెప్పాలి. 


More Telugu News