అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వాట్పాప్ గవర్నెన్స్ సెల్... సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • ఎలా ఉప‌యోగించాలో అవగాహన కల్పించాలి
  • రాబోయే రోజుల్లో వాట్సాప్ ద్వారా 500 సేవలు
జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేకంగా 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేసి, వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రజలు విస్తృతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 500 సేవలు కల్పించనున్నదని తెలిపారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాట్సాప్ గవర్నెన్స్ అమలు ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, వారు ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునేలా చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లందరూ ఈ విషయంలో కీలకంగా పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, ఆయా జిల్లాల్లో వాట్సాప్ గవర్నెన్స్ అమలును పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరంగా అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని, ఇందులో వాట్సాప్ గవర్నెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల్లో ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా సులభంగా పొందేలా ప్రజల్లో అవగాహన కల్పించేలా క్యూ ఆర్ కోడ్ ప్రదర్శించాలన్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల నుంచి వినతులు, వాటి పరిష్కారాలు కూడా మెరుగు అవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలు చెల్లించాల్సిన బిల్లులు కూడా వాట్సాప్ ద్వారా విరివిగా జరిగేలా చూడాలని, ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.   వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉపయోగించాలన్న దానిపై చాలామందిలో సరైన అవగాహన లేదని, వారిలో అవగాహన పెంచేలా ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఆ ప్రాంత ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ పట్ల అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. 


More Telugu News