ఇలాంటివి పాకిస్థాన్ లోనే జరుగుతాయి... మీరు దేశం విడిచి వెళ్లిపోండి: షమా వ్యాఖ్య‌ల‌పై యోగ్‌రాజ్ సింగ్ ఫైర్‌

  • కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై కాంగ్రెస్ నేత‌ షమా మహ్మద్ బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు
  • లావుగా ఉంటాడని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందన్న షమా
  • ఆమె వ్యాఖ్య‌ల‌ను ఖండించిన‌ బీసీసీఐ, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు
  • తాజాగా యువ‌రాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ కూడా ష‌మా వ్యాఖ్య‌ల‌పై మండిపాటు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అతను లావుగా ఉంటాడని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అంతేగాక అతడి ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదని, దేశ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడేనని, అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడంటూ షమా ఎక్స్ వేదిక‌గా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

కాంగ్రెస్ నాయ‌కురాలు చేసిన ఈ వ్యాఖ్యలు అటు సామాజిక మాధ్య‌మాల్లో రాజకీయ దుమారానికి దారితీశాయి. బీజేపీ నేతలతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీసీసీఐ కూడా హిట్‌మ్యాన్‌పై షమా మహ్మద్ బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలపై స్పందించింది. భార‌త జ‌ట్టు సార‌థిపై ఆమె వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొంది.

తాజాగా టీమిండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ కూడా ఆమె వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మైన వ్య‌క్తిపై ఇటాంటి వ్యాఖ్య‌లు చేసిన వాళ్లు సిగ్గుప‌డాల‌ని అన్నారు. ఇలాంటివి పాకిస్థాన్ లో జ‌రుగుతున్నాయి. వారికి మ‌న దేశంలో బ‌తికే హ‌క్కు లేద‌ని, వెంట‌నే దేశం వ‌దిలిపోవాలని యోగ్‌రాజ్‌ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

 "నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక‌ పనిని ఎవరు చేస్తే బాగుంటుందో వారే చేయాలి. కాద‌ని మరెవరైనా చేస్తే అది నాశనమవుతుంది. నాకు నా ప్రాణం కంటే భారత క్రికెటర్లు, ప్రజలు, భూమి చాలా ప్రియమైనవి. రాజకీయ నేత‌లు ఎవరైనా మన దేశానికి గర్వకారణమైన ఆటగాడి గురించి అలాంటి ప్రకటన చేస్తే, ఆ వ్యక్తి సిగ్గుపడాలి" అని యోగ్‌రాజ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు.


"మా దేశంలో ఉండే హక్కు వారికి లేదు. క్రికెట్ మా మతం. ఇలాంటి వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ నాకు చాలా బాధగా ఉంది. పాకిస్థాన్‌లో ఇలాంటివి జరుగుతాయి. వారి మాజీ స్టార్ ఆటగాడు 'ఎవరు ఇన్ని అరటిపండ్లు తింటారు?' అని అన్నాడు (వసీం అక్రమ్‌పై విమర్శలు చేస్తూ). రోహిత్‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన వారిపై చర్య తీసుకోవాలి. దీనిని సహించకూడదు. నేనే ప్రధానమంత్రినైతే ఆమెను వెంట‌నే బ్యాగులు సర్దుకుని దేశం విడిచిపొమ్మ‌ని ఆదేశించి ఉండేవాడిని" అని ఆయన మండిపడ్డారు.  


More Telugu News