ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ప‌రాజ‌యం... రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్!

  • వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్
  • నిన్న‌టి మ్యాచ్‌లో 73 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన బ్యాట‌ర్‌
  • ఆసీస్ త‌ర‌ఫున మొత్తం 170 వన్డేలకు ప్రాతినిధ్యం
  • 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల‌ సాయంతో 5,800 పరుగులు 
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్‌ స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగ‌ళ‌వారం నాడు దుబాయ్‌లో భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట‌ర్‌ ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున 73 పరుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా కూడా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓట‌మి పాలైంది. కాగా, ఛాంపియ‌న్స్ ట్రోఫీకి స్మిత్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించిన విష‌యం తెలిసిందే. రెగ్యుల‌ర్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ చీల‌మండ గాయంతో టోర్నీ నుంచి త‌ప్పుకోవ‌డంతో స్మిత్‌కు తాత్కాలికంగా కెప్టెన్సీ ద‌క్కింది.  

35 ఏళ్ల స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున మొత్తం 170 వన్డేలు ఆడాడు. 86.96 స్ట్రైక్ రేట్, 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడిగా తన కెరీర్‌ను ముగించాడు. ఇక వ‌న్డేల్లో స్మిత్ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 164. 2016లో న్యూజిలాండ్‌పై ఈ స్కోరును నమోదు చేశాడు. లెగ్ స్పిన్నింగ్‌ ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేసిన అతను 28 వికెట్లు కూడా తీసుకున్నాడు. అలాగే 90 క్యాచ్‌లు ప‌ట్టాడు.

2015, 2023లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో స్మిత్ సభ్యుడు. మైఖేల్ క్లార్క్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన‌ తర్వాత అతను 50 ఓవర్ల జట్టుకు ప‌గ్గాలు అందుకున్నాడు. 64 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. స్మిత్ నాయ‌క‌త్వంలో ఆసీస్ 32 మ్యాచ్‌లలో గెలిచి, 28 మ్యాచ్‌లలో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. 

ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఓటమి తర్వాత స్మిత్ తన సహచరులతో వన్డేల నుంచి వెంటనే రిటైర్ అవుతున్నాన‌ని చెప్పిన‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మీడియాకు తెలిపింది. అయితే, అత‌డు టెస్ట్ క్రికెట్, టీ20ల‌కు మాత్రం అందుబాటులో ఉంటాడ‌ని పేర్కొంది. 


More Telugu News