సికింద్రాబాద్ నుంచి కాదు.. ఈ నాలుగు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి..!

  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 720 కోట్లతో అభివృద్ధి పనులు
  • పనులకు ఆటంకం కలగకుండా తాత్కాలికంగా కొన్ని రైళ్లలో మార్పులు
  • కృష్ణా, జన్మభూమి, హదాప్పర్, కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైళ్ల స్టేషన్ మార్పు
సరికొత్తగా రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య పెరుగుతోంది. సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు తాత్కాలికంగా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ. 720 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మేరకు మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. 

తిరుపతి-ఆదిలాబాద్‌ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు (17405) ఈ నెల 26 నుంచి చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. రాత్రి 8.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌లో బయలుదేరి 9.14కు బొల్లారం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17406) ఉదయం 4.29 గంటలకు బొల్లారం, 5.45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.  

కాకినాడ-లింగపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07446) ఏప్రిల్ 2 నుంచి జులై 1 వరకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 9.15 గంటలకు గమ్యస్థానమైన లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07445) సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయల్దేరి 7.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

కాజీపేట నుంచి నడిచే హదాప్పర్ ఎక్స్‌ప్రెస్ (17014) రైలు రాత్రి 8.20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17013) తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఏప్రిల్ 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అలాగే, లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్ 25 నుంచి చర్లపల్లి కేంద్రంగా నడుస్తుంది. ఉదయం 7.15 గంటలకు రైలు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుకుటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.


More Telugu News