సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు

  • అమెరికా హోంశాఖ సంచలన నిర్ణయం
  • కారణాలు ఇంకా వెల్లడి కాని వైనం
  • విద్యార్థులకు తాము అండగా ఉంటామన్న మిచిగాన్ వర్సిటీ వర్గాలు
అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ (CMU)లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. కొందరు విద్యార్థుల వీసాలను అమెరికా హోంశాఖ రద్దు చేయడంతో కలకలం రేగింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించడంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

శుక్రవారం నాడు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి పంపిన ఇ-మెయిల్‌లో యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. 'స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్' (SEVIS) సాధారణ సమీక్షలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే, వీసాలు రద్దు చేయడానికి గల కారణాలను అమెరికా హోంశాఖ వెల్లడించలేదు.

ఈ పరిణామంపై సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీసా రద్దుకు గురైన విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి దిగులు చెందుతున్నారు. "ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదు. చదువు ఎలా కొనసాగించాలో అర్థం కావడం లేదు" అని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.

యూనివర్సిటీ మాత్రం విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా ఇస్తోంది. అంతర్జాతీయ విద్యార్థి సేవల కార్యాలయం ద్వారా విద్యార్థులకు సహాయం అందిస్తామని తెలిపింది. ప్రతిరోజు విద్యార్థుల రికార్డులను సమీక్షిస్తూ, వారి స్టేటస్‌లో ఏమైనా మార్పులుంటే వెంటనే తెలియజేస్తామని పేర్కొంది.

అంతేకాకుండా, న్యాయపరమైన సలహాలు, సహాయం కోసం అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా తూర్పు మిచిగాన్‌లోని లీగల్ సర్వీసెస్‌ను సంప్రదించాలని సూచించింది. వీసా సమస్యలపై వెంటనే ఇమ్మిగ్రేషన్ అటార్నీని సంప్రదించాలని యూనివర్సిటీ విద్యార్థులకు సలహా ఇచ్చింది.


More Telugu News