ఇది ఆస్తి గొడ‌వ కాదు... ఆ ఇంట్లో నా వ‌స్తువులు ఉన్నాయి... ఎందుకు అనుమ‌తించ‌రు?: మంచు మ‌నోజ్‌

  • ఫ్యామిలీ గొడ‌వ‌ల‌తో మ‌రోసారి వార్త‌ల్లో మోహ‌న్‌బాబు కుటుంబం
  • ఈరోజు ఉద‌యం జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్ బాబు ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్న మ‌నోజ్‌
  • లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో గేటు బ‌య‌ట బైఠాయించి నిర‌స‌న‌
  • మీడియాతో మాట్లాడుతూ మంచు మ‌నోజ్ కీల‌క వ్యాఖ్య‌లు
ఫ్యామిలీ గొడ‌వ‌ల‌తో మోహ‌న్‌బాబు కుటుంబం మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. నిన్న త‌న కారు పోయింద‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించిన మంచు మ‌నోజ్‌.. ఇదంతా త‌న సోద‌రుడు మంచు విష్ణు చేయిస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ క్ర‌మంలో ఇవాళ ఉద‌యం జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్ బాబు ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్న ఆయ‌న‌... గేటు బ‌యట బైఠాయించి నిర‌స‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు మ‌నోజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ది ఆస్తి గొడ‌వ కాద‌న్నారు. త‌న జుట్టు విష్ణు చేతుల్లో పెట్టేందుకు ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇంట్లో త‌న పెంపుడు జంతువులు, వ‌స్తువులు ఉన్నాయ‌ని, వాటి కోస‌మే ఇక్క‌డికి వ‌చ్చాన‌ని తెలిపారు. త‌న‌కు ఈ ఆస్తి వ‌ద్ద‌ని ఎప్పుడో తండ్రికి చెప్పాన‌ని, ఇది ఆస్తి గొడ‌వ కాద‌ని చెప్పారు. 

విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే ఇదంతా అన్నారు. అక్క‌డే ఈ గొడ‌వ మొద‌లైంద‌ని తెలిపారు. డిసెంబ‌ర్ నుంచి గొడ‌వలు జ‌రుగుతున్నా పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కూ ఛార్జ్‌షీట్ న‌మోదు చేయ‌లేద‌ని మ‌నోజ్ వాపోయారు. 

ఇక ఈ నెల 1న పాప పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాజస్థాన్ కు వెళ్లిన త‌ర్వాత విష్ణు ప్లాన్ చేసి ఇదంతా చేశార‌ని ఆరోపించారు. తెల్ల‌వారుజామున విష్ణు అనుచ‌రులు వ‌చ్చి కార్ల‌ను తీసుకెళ్ల‌డంతో పాటు త‌న సెక్యూరిటీపై దాడి చేశార‌ని మ‌నోజ్ తెలిపారు. క‌మిష‌న‌ర్ ఇచ్చిన బైండోవ‌ర్‌ను వాళ్లు ఎన్నోసార్లు దాటార‌ని, దొంగ‌త‌నం గురించి చెప్పినా పోలీసులు ఎలాంటి యాక్ష‌న్ తీసుకోవ‌డం లేద‌న్నారు. 

ఇప్పుడు త‌న ఇంట్లోకి తాను వెళ్ల‌డానికి అనుమతి కావాల‌ని పోలీసులు అడుగుతున్నార‌ని, మోహ‌న్‌బాబు చెబితేనే లోప‌లికి పంపిస్తామంటున్నార‌ని మ‌నోజ్ తెలిపారు. కోర్టు నోటీసుల‌తో వ‌చ్చినా లోప‌లికి పంపించ‌డం లేదని, త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మ‌నోజ్ విజ్ఞప్తి చేశారు. 



More Telugu News