ప్రత్యేక విమానంలో భారత్‌కు తహవ్వుర్ రాణా తరలింపు.. మధ్యాహ్నమే ల్యాండింగ్

  • నిన్న సాయంత్రం 7.10 గంటలకు అమెరికాలో బయలుదేరిన విమానం
  • ఢిల్లీలో ల్యాండయ్యాక అధికారికంగా రాణాను అరెస్ట్ చేయనున్న ఎన్ఐఏ
  • ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య తీహార్ జైలుకు తరలింపు
ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్  రాణా ఈ రోజు మధ్యాహ్నం భారత్‌కు చేరుకోనున్నాడు. అతడి అప్పగింతపై అమెరికా మార్గం సుగమం చేసిన నేపథ్యంలో ప్రత్యేక విమానంలో ఆయనను భారత్‌కు తరలిస్తున్నారు. భారత్‌కు చేరుకున్నాక అతడిని అత్యంత భారీ భద్రత మధ్య తీహార్ జైలులో ఉంచుతారు. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ తహవ్వుర్  రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. 

ఇంటెలిజెన్స్ ప్రత్యేక బృందం, దర్యాప్తు అధికారులు కలిసి తహవ్వుర్ రాణాను ప్రత్యేక విమానంలో భారత్ తీసుకొస్తున్నారు. నిన్న సాయంత్రం 7.10 గంటలకు అమెరికాలో బయలుదేరిన విమానం ఈ మధ్యాహ్నం భారత్‌లో ల్యాండ్ కానుంది. భారత్‌లో రాణా ల్యాండ్ అయ్యాక జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) అధికారికంగా అతడిని అరెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత అతడిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తీహార్ జైలుకు తరలిస్తుంది. ఇప్పటికే అతడికి కోసం జైలులో ఓ గదిని సిద్ధం చేశారు. జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే, ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టులో రాణా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొలుత అతడిని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో ప్రవేశపెడతారు. ఎన్ఐఏ న్యాయమూర్తులు ఈ కేసును విచారించే అవకాశం ఉంది. 

పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. నవంబర్ 26, 2008లో 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డారు. తొలుత రైల్వే స్టేషన్‌లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు.


More Telugu News