నీరజ్ చోప్రా ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన అర్ష‌ద్ న‌దీమ్‌.. కార‌ణ‌మిదే!

  • బెంగళూరులో ఎస్‌సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్న నీర‌జ్ చోప్రా
  • ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు పాక్ జావెలియ‌న్ త్రోయ‌ర్ న‌దీమ్‌కు ఆహ్వానం
  • రాబోయే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ కోసం శిక్ష‌ణ పొందుతున్న పాక్ అథ్లెట్‌
  • తన శిక్షణ షెడ్యూల్‌తో ఈ ఈవెంట్‌ క్లాష్ అవుతుండ‌టంతో రాలేన‌ని వివ‌ర‌ణ‌
మే 24న బెంగళూరులో జరిగే ఎస్‌సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు నీరజ్ చోప్రా చేసిన ఆహ్వానాన్ని తాను తిరస్కరించిన‌ట్లు పాకిస్థాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ బుధవారం తెలిపాడు. రాబోయే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ కోసం తన శిక్షణ షెడ్యూల్‌తో ఈ ఈవెంట్‌ క్లాష్ అవుతుండ‌ట‌మే అందుకు కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. 

అయితే, ఈ ఈవెంట్‌కు తనను ఆహ్వానించినందుకు నీర‌జ్‌ చోప్రాకు నదీమ్ కృతజ్ఞతలు తెలిపాడు. "ఎన్‌సీ క్లాసిక్ ఈవెంట్ మే 20 నుంచి ప్రారంభ‌మ‌వుతోంది. అయితే, నేను మే 22న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కోసం కొరియాకు బయలుదేరబోతున్నాను" అని నదీమ్ చెప్పాడు. మే 27 నుంచి 31 వరకు కొరియాలోని గుమిలో జరగనున్న ఆసియా ఛాంపియన్‌షిప్ కోసం తాను క‌ఠోర సాధ‌న చేస్తున్నాన‌ని అతడు చెప్పాడు.

ఇక‌, తాను హోస్ట్ చేస్తున్న ఈ పోటీల‌కు నదీమ్‌కు ఆహ్వానం పంపినట్లు సోమవారం నీర‌జ్‌ చోప్రా తెలిపాడు. "నేను అర్షద్‌కు ఆహ్వానం పంపాను. అతను తన కోచ్‌తో చర్చించిన తర్వాత నన్ను సంప్రదిస్తానని చెప్పాడు. ప్రస్తుతానికి అతను పాల్గొనడాన్ని ఇంకా ధృవీకరించలేదు" అని చోప్రా సోమవారం వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో విలేకరులతో అన్నాడు.

అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్ తొలి ఎడిషన్‌లో గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్, జర్మనీకి చెందిన థామస్ రోహ్లర్ వంటి స్టార్లు పాల్గొంటుండ‌టం విశేషం.

కాగా, 2024 పారిస్ క్రీడల్లో నదీమ్ చోప్రాను ఓడించి 92.97 మీటర్ల ఒలింపిక్ రికార్డు స్థాయి జావెలిన్‌ త్రోతో స్వర్ణం సాధించిన విష‌యం తెలిసిందే. మ‌నోడు 89.45 మీటర్లు విసిరి రజతం గెలిచాడు.


More Telugu News