రాబోయే 78వేల‌ ఏళ్లు కూడా మార్పేమి ఉండ‌దు.. పాక్‌కు సునీల్ గ‌వాస్క‌ర్ చుర‌క‌!

  • ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిపై స్పందించిన భార‌త క్రికెట్ దిగ్గ‌జం
  • భార‌తీయుల‌పై ఈ ఘ‌ట‌న తీవ్ర ప్ర‌భావం చూపింద‌న్న గ‌వాస్క‌ర్‌
  • ఇదంతా ఏం సాధించ‌డానికి చేస్తున్నారని ప్ర‌శ్నించిన లిటిల్ మాస్ట‌ర్‌ 
  • గ‌త 78 ఏళ్ల‌లో ఒక్క మిల్లీమీట‌ర్‌ భూమి కూడా మార‌లేద‌ని వ్యాఖ్య 
  • రాబోయే 78 వేల ఏళ్ల‌కు కూడా ఎటువంటి మార్పు ఉండ‌బోద‌ని పాక్‌కు చుర‌క‌
బెంగుళూరులో గురువారం ఆర్‌సీబీ, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య ఐపీఎల్ మ్యాచ్ జ‌రిగిన స‌మ‌యంలో భార‌త మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్.. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి బాధిత కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కొన్ని అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. భార‌తీయుల‌పై ఆ ఘ‌ట‌న తీవ్ర ప్ర‌భావం చూపింద‌న్నారు. దాడికి పాల్ప‌డిన కుట్ర‌దారుల్ని, ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వారిని కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌శ్న వేశారు. ఇదంతా ఏం సాధించ‌డానికి చేస్తున్నారని గ‌వాస్క‌ర్ ప్ర‌శ్నించారు. 

గ‌త 78 ఏళ్ల‌లో ఒక్క మిల్లీమీట‌ర్‌ భూమి కూడా మార‌లేద‌ని, అంటే రాబోయే 78 వేల ఏళ్ల‌కు కూడా ఎటువంటి మార్పు ఉండ‌బోద‌ని పాక్‌కు ప‌రోక్షంగా చుర‌క‌లంటించారు. మ‌రి అలాంట‌ప్పుడు శాంతియుతంగా ఎందుకు జీవించ‌డం లేద‌ని గ‌వాస్క‌ర్ ప్ర‌శ్నించారు. దేశాన్ని ఎందుకు బ‌లోపేతం చేయ‌డం లేద‌ని అడిగారు. స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, పహ‌ల్గామ్ ఉగ్ర‌వాద దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు మృతిచెందారు. దాడి నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. అటు ఈ పాశవిక ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న‌ తీవ్రంగా స్పందించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న శక్తులకు ఊహకు కూడా అందని రీతిలో కఠిన శిక్ష తప్పదని ప్ర‌ధాని గట్టిగా హెచ్చరించారు. 

బీహార్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై తొలిసారిగా నేరుగా స్పందించి, కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక ప్రజలను అతి కిరాతకంగా చంపిన ముష్కరులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని శిక్షించి తీరుతామని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్ప శక్తి ఉగ్రవాదుల వెన్ను విరుస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారతదేశం దృఢ సంకల్పంతో ఉందని, ఉగ్రవాద చర్యల ద్వారా దేశ ఐక్యతా స్ఫూర్తిని దెబ్బతీయలేరని ప్ర‌ధాని మోదీ అన్నారు.


More Telugu News