అదే టైమ్ కు... రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ధోనీ, రోహిత్‌

  • హ‌ఠాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌
  • నిన్న సాయంత్రం 7 గంట‌ల 29 నిమిషాల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌ట‌న‌
  • ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే స‌మ‌యానికి టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన ధోనీ
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుధవారం హ‌ఠాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా తాను రెడ్‌-బాల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్రకటించాడు. హిట్‌మ్యాన్‌ నిర్ణయం అభిమానులను షాక్‌ గురి చేసింది. అయితే, యాదృచ్చికంగా రోహిత్ టెస్టుల‌కు  రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స‌మ‌యం, మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ లాంగ్ ఫార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న ప్ర‌క‌టించిన స‌మ‌యం ఒక‌టే కావ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. 

మ‌హీ కూడా సైలెంట్‌గా సాయంత్రం వేళ సోష‌ల్ మీడియా ద్వారా రెడ్‌-బాల్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ధోనీ 2020లో ఏ క్ష‌ణాన రిటైర్మెంట్ ప్ర‌క‌టించారో స‌రిగ్గా బుధవారం నాడు అదే స‌మ‌యానికి (19:29 గంటలు) రోహిత్ కూడా త‌న టెస్ట్ కెరీర్‌కు ముగింపు ప‌లికాడు. ఈ ఇద్ద‌రూ సొంత గ‌డ్డ‌పై వాంఖ‌డే స్టేడియంలో, విదేశీ గ‌డ్డ‌పై మెల్‌బోర్న్‌లో త‌మ చివ‌రి టెస్టులు ఆడ‌డం గ‌మ‌నార్హం. 

"హలో ఎవ్రీ వన్... నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వైట్ డ్రెస్‌లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. సంవత్సరాలుగా నాపై మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు" అని రోహిత్ టీమిండియా టెస్ట్ క్యాప్ ఫొటోతో త‌న టెస్ట్ రిటైర్మెంట్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశాడు. 

కాగా, రోహిత్ సారథ్యంలో భార‌త జ‌ట్టు 24 టెస్టులు ఆడింది. ఇందులో భార‌త్‌ 12 టెస్టుల్లో విజ‌యం సాధించ‌గా... తొమ్మిదింట్లో ప‌రాజ‌యం పాలైంది. మూడు డ్రాగా ముగిశాయి. టెస్టుల నుంచి రిటైర్‌ అయిన రోహిత్‌ వన్డేల్లో మాత్రం కనిపించనున్నాడు. ఇక‌, గ‌తేడాది జ‌రిగిన ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ త‌ర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా హిట్‌మ్యాన్ వైదొలిగిన విష‌యం విదిత‌మే. 


More Telugu News