అచ్యుతాపురం కాల్ సెంటర్ ముఠా... అమెరికా వాసులే టార్గెట్!

  • అచ్యుతాపురంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి!
  • కాల్ సెంటర్ ద్వారా అమెరికన్లే లక్ష్యంగా దందా
  • నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర మోసాలు గుర్తింపు
  • ఇప్పటివరకు 33 మందిని అరెస్టు చేసిన పోలీసులు
  • రెండేళ్లుగా ఉత్తరాది ముఠా కార్యకలాపాలు
  • దేశవ్యాప్త దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా సాగుతున్న భారీ అంతర్జాతీయ సైబర్ మోసం గుట్టురట్టయింది. అమెరికా పౌరులనే లక్ష్యంగా చేసుకొని, కాల్ సెంటర్ ముసుగులో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ముఠా కార్యకలాపాలను పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా మీడియాకు వెల్లడించారు.

ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు గత రెండేళ్లుగా అచ్యుతాపురంలో ఓ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ కాల్ సెంటర్ ద్వారా అమెరికాతో పాటు ఇతర దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆయన వివరించారు. ఈ ముఠా నెలకు సుమారు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.

అచ్యుతాపురంలోని ఈ నకిలీ కాల్ సెంటర్‌లో దాదాపు 200 నుంచి 250 మంది వరకు పనిచేస్తున్నారని, వీరిలో ఇప్పటివరకు 33 మందిని అరెస్టు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. నిందితుల నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. కాల్ సెంటర్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సీఐడీ అధికారుల సహకారం కూడా తీసుకుంటున్నామని, నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


More Telugu News