యువతితో తేజ్ ప్రతాప్.. తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందన్న ఆర్జేడీ నేత

  • తేజ్ ప్రతాప్ ఫేస్‌బుక్‌లో యువతితో ఫోటో, "12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం" అని పోస్ట్
  • వెంటనే డిలీట్, తన అకౌంట్ హ్యాక్ అయిందన్న తేజ్ ప్రతాప్
  • ఇది తనను, తన కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేసే కుట్ర అని ఆరోపణ
  • 2018లో ఐశ్వర్యరాయ్‌తో వివాహం.. కొన్ని నెలలకే మనస్పర్థలు
  • వదంతులను నమ్మవద్దని మద్దతుదారులకు తేజ్ ప్రతాప్ విజ్ఞప్తి
బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సోషల్ మీడియా ఖాతా మరోసారి వివాదానికి దారితీసింది. తన ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయిందని ఆయన శనివారం ప్రకటించారు. ఓ యువతితో తాను ‘ప్రేమలో ఉన్నాను’ అంటూ ఆయన ప్రొఫైల్‌లో ఓ పోస్ట్ ప్రత్యక్షమైన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. తేజ్ ప్రతాప్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ యువతితో ఆయన ఉన్న ఫోటోతో పాటు ఓ క్యాప్షన్ కనిపించింది. "ఈ చిత్రంలో కనిపిస్తున్నది అనుష్క యాదవ్. మాకు గత 12 ఏళ్లుగా ఒకరికొకరం తెలుసు. మేము ప్రేమలో ఉన్నాం. రిలేషన్‌షిప్‌లో ఉన్నాం" అని ఆ క్యాప్షన్‌లో రాసి ఉంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. పలు మీడియా సంస్థలు కూడా దీనిపై కథనాలు ప్రచురించాయి.

ఈ పరిణామంపై తేజ్ ప్రతాప్ యాదవ్ 'ఎక్స్'  ద్వారా స్పందించారు. తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని, తన ఫోటోలను తప్పుగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని ఆరోపించారు. "నా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ హ్యాక్ అయింది. నా ఫోటోగ్రాఫ్‌లను తప్పుగా ఎడిట్ చేశారు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇది తనను, తన కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి, వేధించడానికి చేసిన ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఆ ‘రిలేషన్‌షిప్’ పోస్ట్ బయటకు రాగానే సోషల్ మీడియా యూజర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 37 ఏళ్ల తేజ్ ప్రతాప్ యాదవ్‌కు 2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్‌తో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన సంగతిని పలువురు గుర్తుచేశారు. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది నెలల్లోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తన భర్త, అత్తమామలు తనను ఇంటి నుంచి బలవంతంగా పంపించేశారని ఐశ్వర్య ఆరోపించారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.


More Telugu News