థాంక్యూ డిప్యూటీ సీఎం గారూ... పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన దిల్ రాజు

  • టికెట్ ధరల పెంపు, థియేటర్లలో తినుబండారాల ధరలపై పవన్ సూచనలు
  • పవన్ ఆలోచనలతో ఏకీభవిస్తున్నానన్న దిల్ రాజు
  • ఈ మేరకు ఓ  ప్రకటన విడుదల
థియేటర్ల బంద్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కూడా స్పందించడం తెలిసిందే. దీని వెనుక ఉన్న వ్యక్తులెవరో తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇకపై కొత్త సినిమాల టికెట్ ధరల పెంపు కోసం నేరుగా నిర్మాతలే ప్రభుత్వాల వద్దకు వచ్చే పద్ధతి కాకుండా, ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలని కూడా పవన్ సూచించారు. అంతేకాకుండా, థియేటర్లలో నెలకొన్న పరిస్థితులు, తినుబండారాల ధరలు, కూల్ డ్రింక్స్ ధరలపై సమీక్షించాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రేక్షకులను సినిమా థియేటర్ కు రప్పించేలా చర్యలు ఉండాలని సూచించారు. దీనిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. 

ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రందించాలనే సూచన చిత్ర పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందని తెలిపారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులు పవన్ కల్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని దిల్ రాజు వెల్లడించారు. 

"సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సినిమా థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఆయన అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి కలసికట్టుగా ముందుకు సాగుదాం. 

దాంతోపాటే... థియేటర్ల నుంచి ఓటీటీ వేదికలపైకి సినిమాలు త్వరగా వెళుతుండడంతో ప్రేక్షకులు ఓటీటీ వైపునకు మొగ్గుచూపుతున్నారు. అందుకే, ఒక సినిమా ఎంత కాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత. 

అదే సమయంలో, థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలుగుతాం. అలాగే, ఏపీ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి నుంచి కలసికట్టుగా సంపూర్ణ సహకారం అందిస్తాం" అని దిల్ రాజు ప్రకటించారు.


More Telugu News