అద్భుత‌మైన యార్క‌ర్‌తో మ్యాచ్‌ను మ‌లుపు తిప్పిన బుమ్రా.. ఇదిగో వీడియో!

  • ముల్లాన్‌పూర్ వేదిక‌గా నిన్న‌ ఎలిమినేటర్ మ్యాచ్‌
  • హోరాహోరీగా త‌ల‌ప‌డ్డ ఎంఐ, జీటీ
  • ఉత్కంఠ పోరులో ముంబ‌యిని వ‌రించిన‌ విజ‌యం
  • సూప‌ర్ యార్క్‌ర్‌తో సుంద‌ర్‌ను బోల్తా కొట్టించిన బుమ్రా
శుక్ర‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)ను ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) 20 ప‌రుగుల తేడాతో ఓడించిన విష‌యం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 228 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. జీటీకి 229 ప‌రుగుల కొండంత ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 

అయితే, ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ గిల్ (01) ఈ మ్యాచ్‌లో నిరాశ‌ప‌రిచాడు. దీంతో జ‌ట్టు స్కోర్ 3 ర‌న్స్ వ‌ద్ద జీటీ తొలి వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత బ‌ట్ల‌ర్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన కుశాల్ మెండిస్ (20) కొద్దిసేపు క్రీజులో నిల‌బ‌డ్డాడు. సుద‌ర్శ‌న్ తో క‌లిసి రెండో వికెట్‌కు అమూల్య‌మైన‌ 64 పరుగులు జోడించాడు. వేగంగా ఆడే క్ర‌మంలో సెల్ఫ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 

ఇక‌, మెండిస్ ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ భారీ షాట్ల‌తో విరుచుకుప‌డ్డాడు. జ‌ట్టు స్కోర్‌ను ఈ ద్వ‌యం 150 ప‌రుగులు దాటించింది. దీంతో గుజ‌రాత్ విజ‌యంపై ఆశ‌లు చిగురించాయి. స‌రిగ్గా అప్పుడే వారి ఆశ‌ల‌పై స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా నీళ్లు చ‌ల్లాడు. అద్భుత‌మైన యార్క్‌తో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సుంద‌ర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 13.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లకు 151 ర‌న్స్‌తో ప‌టిష్ట స్థితిలో ఉన్న జీటీని, బుమ్రా సుంద‌ర్‌(48)ను పెవిలియ‌న్‌కి పంపి కోలుకోని దెబ్బ‌తీశాడు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న వీరి భాగ‌స్వామ్యానికి తెర‌దించాడు. 

ఆ త‌ర్వాత 15.3 ఓవ‌ర్ల వ‌ద్ద గ్లీసెన్ కూడా చ‌క్క‌టి యార్క‌ర్‌తో సుద‌ర్శ‌న్‌(80)ను బోల్తా కొట్టించాడు. దీంతో గుజ‌రాత్‌కు ల‌క్ష్యాన్ని ఛేదించ‌డం క‌ష్టంగా మారింది. చివ‌రికి 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దాంతో 20 ప‌రుగుల తేడాతో ముంబ‌యి గెలిచింది. ఈ విజ‌యంతో క్వాలిఫ‌య‌ర్‌-2కు అర్హ‌త సాధించిన ఎంఐ... రేపు (ఆదివారం) అహ్మ‌దాబాద్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో త‌ల‌ప‌డ‌నుంది.      




More Telugu News