శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ అపహరణ.. పోలీసుల జోక్యంతో గంటల్లోనే కథ సుఖాంతం

  • ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అనుచరులే చేశారని ప్రిన్సిపాల్ కుమారుడి ఫిర్యాదు
  • కళాశాల స్థల వివాదమే కారణమని ఆరోపణ 
  • సీసీటీవీ ఫుటేజ్, సెల్ లొకేషన్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
  • గుంటూరులో ఉన్నట్లు నిర్ధారణ.. అర్ధరాత్రి ఇంటికి ప్రిన్సిపల్  
  • ఆయనే స్వయంగా వచ్చారని ఎమ్మెల్సీ పీఏ రాజేష్ వెల్లడి
శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ వంకాయలపాటి శ్రీనివాస్‌ను కొందరు వ్యక్తులు అపహరించారన్న వార్తతో విజయవాడలో కలకలం రేగింది. ఈ ఘటన వెనుక టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అనుచరులు ఉన్నారని ప్రిన్సిపల్ కుమారుడు ఆరోపించడం సంచలనమైంది. అయితే, పోలీసుల తక్షణ జోక్యంతో గంటల వ్యవధిలోనే ఈ ఉదంతం సుఖాంతమైంది. ప్రిన్సిపల్ శ్రీనివాస్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు.

ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమారుడు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ శుక్రవారం రాత్రి తన తండ్రిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాజేష్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఈ అపహరణకు పాల్పడ్డారని ఆరోపించారు. బందరు రోడ్డులోని డి అడ్రస్‌ మాల్‌ వద్ద ఈ ఘటన జరిగిందని, తన తండ్రిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని గుంటూరుకు తీసుకెళ్లారని తెలిపారు. శాతవాహన కళాశాల స్థలానికి సంబంధించి తమ కుటుంబానికి, ఎమ్మెల్సీ వర్గానికి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోందని వివరించారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగినట్లు చెబుతున్న డి అడ్రస్‌ మాల్‌ వద్ద ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లో ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్‌ భుజంపై చేయి వేసి ఆయన్ను కారులో తీసుకెళ్తున్నట్లు రికార్డయింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, బాధితుడు శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేయగా అది గుంటూరులో ఉన్నట్లు చూపించింది. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల సెల్‌ఫోన్ లొకేషన్లు కూడా గుంటూరులోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కృష్ణలంక పోలీసులు గుంటూరు బయలుదేరారు.

అయితే, పోలీసు బృందం గుంటూరుకు చేరుకునే లోపే కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి, తండ్రి తనతో ఫోన్‌లో మాట్లాడారని, తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పారని తెలియజేశారు. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం, శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ విజయవాడలోని తన నివాసానికి సురక్షితంగా చేరుకున్నారు.

ఈ ఆరోపణలపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పీఏ రాజేష్ స్పందించారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్‌ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆయనే స్వయంగా గుంటూరు వచ్చారని తెలిపారు. "శ్రీనివాస్ ఇక్కడ (గుంటూరులో) ఉన్నప్పుడే విజయవాడ డీసీపీ సరిత మాట్లాడారు. ఆమెతో కూడా శ్రీనివాస్‌ మామూలుగానే మాట్లాడారు. ఈ వ్యవహారంలో మా తప్పేమీలేదు" అని వివరించారు. 


More Telugu News