పథకం ప్రకారమే ఆయన లొంగిపోయారు: ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్

  • ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్‌రావు లొంగుబాటు ఒక పథకమేనన్న బండి సంజయ్
  • అమెరికాలో కేసీఆర్ కుటుంబంతో చర్చల తర్వాతే లొంగిపోయారని ఆరోపణ
  • సిట్ విచారణలో ప్రభాకర్‌రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్
  • జడ్జిలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని విమర్శ
  • కాంగ్రెస్ పాలనలో అవినీతి కేసుల విచారణ ముందుకు సాగడం లేదని వ్యాఖ్య
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు లొంగిపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభాకర్‌రావు ఒక పథకం ప్రకారమే లొంగిపోయారని ఆయన సోమవారం వ్యాఖ్యానించారు. సిట్ విచారణలో ప్రభాకర్‌రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని తక్షణమే ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

అమెరికాలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో ప్రభాకర్‌రావుకు కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే ఆయన లొంగిపోయారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. "జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్‌రావు. ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారో ప్రజలకు తెలియాలి" అని బండి సంజయ్ అన్నారు.

ఫోన్ ట్యాప్ చేసి సేకరించిన సమాచారంతో ఏం చేశారని, ఆ ఆడియోలను ఎవరికి పంపారని ఆయన ప్రశ్నించారు. ట్యాపింగ్ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పాలనపై విశ్వాసం సన్నగిల్లుతోందని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క అవినీతి కేసు విచారణ కూడా ముందుకు సాగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుతో పాటు ఈ వ్యవహారంలో సూత్రధారులందరినీ దోషులుగా తేల్చి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News