మాజీ సీఎం విజ‌య్ రూపానీకి అదృష్ట సంఖ్యే దుర‌దృష్ట‌క‌రంగా మారింది!

  • అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే క్రాష్
  • ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు 241 మంది మృతి
  • '1206'ను అదృష్ట సంఖ్యగా భావించే విజయ్ రూపానీ
  • ఆయ‌న ప‌ర్స‌న‌ల్ వాహ‌నాలు అన్నింటికీ అదే నంబ‌ర్‌ 
  • నిన్న తేదీ 12-06 కావ‌డంతో అదృష్ట సంఖ్యే ఆయ‌న‌కు దుర‌దృష్ట‌క‌రంగా మారిందంటున్న నెటిజ‌న్లు
గుజరాలోని అహ్మ‌దాబాద్‌లో పెను విషాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్‌విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171 (బోయింగ్ 787-8) నిన్న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు మొత్తం 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘాని నగర్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో బ్రిటిష్ జాతీయుడైన విశ్వాస్ కుమార్ రమేశ్‌ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారని, ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

ఇక‌, మృతుల్లో మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉండటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, విజయ్ రూపానీ "1206" సంఖ్యను తన అదృష్ట సంఖ్యగా భావించేవారు. ఆయ‌న ప‌ర్స‌న‌ల్ వెహిక‌ల్స్ అన్నింటికీ అదే నంబ‌ర్ ఉండేద‌ని జాతీయ మీడియా పేర్కొంది. నిన్న తేదీ 12-06 కావ‌డంతో అదృష్ట సంఖ్యే ఆయ‌న‌కు దుర‌దృష్ట‌క‌రంగా మారింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. 



More Telugu News