తల్లికి హార్ట్ అటాక్... హుటాహుటీన ఇంగ్లండ్ నుంచి వచ్చేసిన టీమిండియా కోచ్ గంభీర్

  • టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తల్లికి తీవ్ర అస్వస్థత
  • గుండెపోటుతో ఢిల్లీలోని ఆసుపత్రి ఐసీయూలో చికిత్స
  • జూన్ 11న ఘటన, జూన్ 12న గంభీర్ భారత్‌ చేరిక
  • తల్లి ఆరోగ్యం మెరుగుపడితేనే ఇంగ్లండ్‌కు తిరుగు ప్రయాణం
  • జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ టెస్ట్ సిరీస్ ప్రారంభం
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. గంభీర్ తల్లి జూన్ 11న గుండెపోటుకు గురికావడంతో, గంభీర్ జూన్ 12న హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు.

గంభీర్ తల్లి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి గంభీర్ తన తల్లి బాగోగులు చూసుకుంటున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాతే తిరిగి ఇంగ్లండ్‌కు బయలుదేరే అవకాశం ఉంది. అయితే, జూన్ 20న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ నాటికి గంభీర్ జట్టుతో కలుస్తారని ఆశిస్తున్నారు. గంభీర్ ప్రయాణ తేదీ పూర్తిగా ఆయన తల్లి ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు జూన్ 6న ఇంగ్లండ్ చేరుకుంది. లండన్‌లోని బెక్స్‌హామ్‌లో జట్టు సభ్యులు కఠోర సాధన చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే పలు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది. నేటి నుంచి (జూన్ 13) నాలుగు రోజుల పాటు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం జట్టు లీడ్స్‌కు బయలుదేరుతుంది, అక్కడ హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తో 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కు శ్రీకారం చుట్టనున్నారు.


More Telugu News