అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్

  • ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవకుండా ఆంక్షలు పెట్టడమా?
  • ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
  • దేశ చరిత్రలోనే బహుశా ఇదే ప్రప్రథమం అంటూ చంద్రబాబుపై మండిపడ్డ జగన్
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను, మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అణచివేతపై ప్రజలకు నిజం తెలియాల్సి ఉందనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో తాను పర్యటిస్తే పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ ప్రజలను అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. బహుశా దేశ చరిత్రలో ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అణచివేత అనే పదానికి చంద్రబాబు నిర్వచనంగా మారారని ఆరోపించారు.

సత్తెనపల్లిలో బుధవారం నిర్వహించిన తన పర్యటన మొత్తం కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగిందని జగన్ ఆరోపించారు. తాను ప్రజలను కలవడానికి ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏమొచ్చిందని, చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు. తన పర్యటన సందర్భంగా ప్రజలు, పార్టీ నేతలు ఎవరూ రాకుండా అధికారుల ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని, రైతుల సమస్యలు వెలుగులోకి రాకుండా టాపిక్ డైవర్షన్ చేస్తోందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు
ప్రజల సమస్యలపై ఎవరూ గొంతెత్తకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందని జగన్ ఆరోపించారు. సత్తెనపల్లిలో తన పర్యటన ఎంతగా సక్సెస్ అయిందో తనకంటే మీడియాకే ఎక్కువ తెలుసని చెప్పారు. నాయకుల గొంతు నొక్కేందుకే తప్పుడు కేసులు పెడుతోందని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు ఇదే కోవలోకి చెందిందని ఆరోపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు ఆయన గన్ మెన్ తోనే స్టేట్ మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వనని చెప్పినందుకు గన్ మెన్ పై దాడి చేయించారని చెప్పారు. తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీతో పాటు ఆ గన్ మెన్ డీజీపీకి, గవర్నర్ కు, రాష్ట్రపతికి లేఖలు పంపాడని గుర్తుచేశారు. దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తున్నాడని జగన్ చెప్పారు.

ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారట..
ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తానని వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందిస్తూ ‘ఎప్పుడు భూస్థాపితం చేస్తారు’ అని సదరు యాంకర్, ఆ టీవీ యజమాని అడుగుతున్నాడని విమర్శించారు. ఇదిగో మొదలు పెట్టేశాం, ఇక భూస్థాపితం చేసేస్తామని చంద్రబాబు బదులిచ్చాడని చెప్పారు. ‘76 ఏళ్ల వయసులో ఈ మాటలేంటి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏంటి, ఈ బెదిరింపులు ఏంటి.. వాడిని తొక్కుతా, వీడిని తొక్కుతా అనే మాటలేంటి?’ అని జగన్ నిలదీశారు. ప్రజలు ఏదో దయతలచి అధికారం కట్టబెడితే వారికి మంచి చేయాల్సింది పోయి ఈ బెదిరింపులు ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, చేయాల్సిన, చేస్తానని చెప్పిన పనులను పక్కన పెట్టి అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ఈ మోసాలపై నిలదీసే వారిని భూస్థాపితం చేస్తానని బెదిరించడమేంటని జగన్ ప్రశ్నించారు.


More Telugu News