ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం

  • భారత్ 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుందన్న సచిన్
  • జస్‌ప్రీత్ బుమ్రా కీలక బౌలర్‌గా రాణిస్తాడని ధీమా
  • కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టుపై నమ్మకం
  • కోహ్లీ, రోహిత్ లేని లోటును యువ ఆటగాళ్లు తీరుస్తారని ఆశాభావం
  • బుమ్రా పనిభారంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పాడు. భారత టెస్ట్ క్రికెట్‌లో నవశకం ఆరంభమవుతున్న తరుణంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టులో యువ ఆటగాళ్లతో కూడిన నూతన బ్యాటింగ్ లైనప్ బరిలోకి దిగనుంది.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... "ఈ సిరీస్‌లో భారత్ 3-1 తేడాతో గెలుస్తుందని నేను భావిస్తున్నాను" అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. జ‌స్ప్రీత్ బుమ్రా పనిభారంపై కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, ఈ పర్యటనలో అతడే భారత జట్టుకు ప్రధాన పేస్ బౌలర్ (స్ట్రైక్ బౌలర్) అవుతాడని సచిన్ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో జ‌స్ప్రీత్ బుమ్రా కీల‌క పాత్ర‌ను స‌చిన్‌ వివరిస్తూ... "భారత బౌలింగ్ విభాగం చాలా వరకు బుమ్రా ప్రదర్శనపైనా, అతనికి మిగతా బౌలర్లు ఎలా సహకరిస్తారన్న దానిపైనా ఆధారపడి ఉంటుంది. బుమ్రా నిస్సందేహంగా మన ప్రధాన బౌలర్. అతడితో పాటు నా అనుభవం ప్రకారం ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, నితీశ్ రెడ్డి వంటివారు సహాయక బౌలర్లుగా ఉంటారు. 

నేను కొన్ని పేర్లు మరిచిపోయి ఉండొచ్చు. హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. మన బౌలింగ్ దళం సమతూకంగా ఉందని నేను భావిస్తున్నాను. మనం కచ్చితంగా మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాను" అని స‌చిన్‌ తెలిపాడు.


More Telugu News