జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా

  • సత్తెనపల్లి ప్రమాదంలో సింగయ్య మృతి, జగన్‌పై కేసు నమోదు
  • జగన్‌ను ఏ2గా చేర్చిన పోలీసులు
  • కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్న రోజా
సత్తెనపల్లిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఏ2గా చేర్చడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనం చక్రాల కింద పడి సింగయ్య మృతి చెందినట్లు కొన్ని వీడియోల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు వాహన డ్రైవర్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేయగా, అందులో జగన్‌ను రెండో నిందితుడిగా పేర్కొన్నారు.

ఈ పరిణామంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక, ఆయన్ను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టిని తమ వైఫల్యాల నుంచి మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ఈ నెల 18వ తేదీన జరిగిన ఘటనలో సింగయ్య మృతికి జగన్ కారు కారణం కాదని ఎస్పీయే చెప్పారని, కానీ 22వ తేదీన ఒక ఫేక్ వీడియోను బయటకు తెచ్చి, జగన్ కారు వల్లే ప్రమాదం జరిగిందని కట్టుకథ అల్లుతున్నారని రోజా ఆరోపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని, దాన్ని ఎక్కడ పరీక్షించినా అది ఫేక్ అని తేలుతుందని ఆమె పేర్కొన్నారు. ఇది పూర్తిగా జగన్‌పై కక్ష సాధించి, ఆయనను ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతో చేస్తున్న కుట్ర అని రోజా ఆరోపించారు. 


More Telugu News