'కన్నప్ప'పై పైరసీ పంజా.. హార్ట్ బ్రేకింగ్ అంటూ మంచు విష్ణు ట్వీట్

  • 'కన్నప్ప'ను వెంటాడుతున్న పైరసీ భూతం
  • ఇప్పటికే 30వేల‌కు పైగా పైరసీ లింకులను తొలగించిన చిత్ర బృందం
  • ఇది చాలా బాధాకరమని మంచు విష్ణు ఆవేదన
  • పైరసీని దొంగతనంతో పోల్చిన హీరో విష్ణు
  • సినిమాను సరైన మార్గంలోనే ఆదరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి
ప్ర‌తిష్ఠాత్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న 'కన్నప్ప' చిత్రంపై పైరసీ భూతం పంజా విసిరింది. ఈ చిత్రానికి సంబంధించిన వేలాది పైర‌సీ లింకులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంపై 'కన్నప్ప' చిత్ర బృందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేర‌కు హీరో మంచు విష్ణు హార్ట్ బ్రేకింగ్ అంటూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ఇప్పటివరకు 30,000కు పైగా పైరసీ లింకులను గుర్తించి తొలగించినట్లు వెల్లడించారు.

"మా 'కన్నప్ప' సినిమా పైరసీకి గురవుతోంది. ఇది చాలా బాధాకరం. ఇప్పటికే 30,000 పైచిలుకు పైరసీ లింకులను తొలగించాం. పైరసీ అనేది ముమ్మాటికీ దొంగతనమే. మనం మన పిల్లలకు దొంగతనం చేయమని నేర్పించం కదా? పైరసీ కంటెంట్ చూడటం కూడా అలాంటిదే. దయచేసి దీనిని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో సినిమాకు మద్దతు ఇవ్వండి" అని విష్ణు విజ్ఞప్తి చేశారు. 

ఎంతో శ్రమ, పెట్టుబడితో నిర్మించే సినిమాలను పైరసీ రూపంలో దెబ్బతీయడం దారుణమని ఆయ‌న‌ పేర్కొన్నారు.  సినిమా పరిశ్రమను తీవ్రంగా నష్టపరిచే పైరసీని అరికట్టేందుకు ప్రేక్షకుల సహకారం ఎంతో అవసరమని విష్ణు అభిప్రాయపడ్డారు. సినిమాను థియేటర్లలో లేదా అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే చూసి, తమ కష్టానికి ప్రతిఫలం అందించాలని కోరారు. 


More Telugu News