ఆస్ట్రేలియా విమానంలో పాము కలకలం: రెండు గంటలు ఆలస్యమైన ప్రయాణం!

  • ఆస్ట్రేలియాలో ఓ దేశీయ విమానంలో పాము కలకలం
  • విమానం కార్గో హోల్డ్‌లో పామును గుర్తించిన సిబ్బంది
  • రెండు గంటల పాటు ఆలస్యమైన వర్జిన్ ఆస్ట్రేలియా విమానం
  • విషరహితమైన గ్రీన్ ట్రీ స్నేక్‌గా గుర్తింపు
  • ప్రయాణికుల లగేజీ నుంచే వచ్చి ఉంటుందని అనుమానం
  • చాకచక్యంగా పామును పట్టుకున్న నిపుణుడు
ఆస్ట్రేలియాలో ఓ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం కార్గో హోల్డ్‌లో ఒక పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. దీంతో విమానం దాదాపు రెండు గంటలపాటు ఆలస్యంగా బయలుదేరింది. ఈ సంఘటన మంగళవారం మెల్‌బోర్న్ విమానాశ్రయంలో జరిగింది.

వర్జిన్ ఆస్ట్రేలియాకు చెందిన వీఏ337 విమానం మెల్‌బోర్న్ నుంచి బ్రిస్బేన్ వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు విమానంలోకి ఎక్కుతుండగా సిబ్బంది కార్గో హోల్డ్‌లో పామును గుర్తించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పాములు పట్టడంలో నిపుణుడైన మార్క్ పెల్లీకి సమాచారం అందించారు.

విమానాశ్రయానికి చేరుకున్న పెల్లీ, కార్గో హోల్డ్‌లోకి ప్రవేశించారు. అక్కడ ప్యానెల్ వెనుక సగం దాక్కుని ఉన్న పామును చూశారు. ఆ చీకటిలో అది విషపూరితమైన పాము అయి ఉంటుందని తాను మొదట భావించినట్టు పెల్లీ తెలిపారు. "ఒకే ప్రయత్నంలో నేను దీన్ని పట్టుకోలేకపోతే, అది ప్యానెళ్ల లోపలికి జారుకుంటుంది. అప్పుడు మనం విమానాన్ని మొత్తం ఖాళీ చేయించి, దాన్ని వెతకాల్సి ఉంటుంది" అని ఆయన విమాన సిబ్బందిని, ఇంజనీర్లను హెచ్చరించినట్టు వివరించారు.

అయితే, ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పెల్లీ, మొదటి ప్రయత్నంలోనే ఆ పామును పట్టుకున్నారు. "అదృష్టవశాత్తు నేను దాన్ని ఒకే ప్రయత్నంలో పట్టుకున్నాను. లేదంటే ఈ పాటికి మేమంతా బోయింగ్ 737 విమానాన్ని పూర్తిగా తనిఖీ చేయవలసి వచ్చేది" అని ఆయన అన్నారు. పామును పట్టుకున్న తర్వాత అది హాని చేయని, 60 సెంటీమీటర్ల పొడవున్న ‘గ్రీన్ ట్రీ స్నేక్’ అని గుర్తించారు.

ఈ పాము బ్రిస్బేన్ ప్రాంతానికి చెందినది కావడంతో, అక్కడి నుంచి మెల్‌బోర్న్‌కు వచ్చిన విమానంలో ప్రయాణికుల లగేజీ ద్వారా ఇది లోపలికి ప్రవేశించి ఉంటుందని పెల్లీ అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం, ఈ పామును తిరిగి అడవిలో వదిలిపెట్టే అవకాశం లేదు. ఇది రక్షిత జాతికి చెందిన పాము కావడంతో, లైసెన్స్ ఉన్న సంరక్షకుడికి అప్పగించేందుకు దాన్ని ఒక జంతు వైద్యుడికి అందజేశారు.


More Telugu News