నా కెరీర్ ముగిసిందని ఆరోజే అర్థమైంది: శిఖర్ ధావన్

  • టీమిండియాలో చోటు కోల్పోవడంపై స్పందించిన శిఖర్ ధావన్
  • ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో తన కెరీర్ ముగిసిందనిపించిందన్న గబ్బర్
  • గిల్ అద్భుత ఫామ్ వల్లే తనకు అవకాశం రాలేదని వెల్లడి
  • జట్టుకు ఎంపిక చేయనప్పుడు సెలక్టర్లను వివరణ అడగలేదని స్పష్టం
  • అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాత్రం మాట్లాడానన్న ధావ‌న్
గత దశాబ్ద కాలంలో భారత అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన శిఖర్ ధావన్, టీమిండియా నుంచి తన నిష్క్రమణపై ఎట్టకేలకు మౌనం వీడాడు. వన్డే ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, జట్టులో చోటు కోల్పోవడానికి గల కారణాలను, ఆ సమయంలో తన మానసిక స్థితిని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ముఖ్యంగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసిన రోజే తన అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయిందని తన అంతరాత్మ చెప్పిందని ధావన్ పేర్కొన్నాడు. 

ఆ సమయంలో తాను 50లు, 70లు వంటి స్కోర్లు చేస్తున్నప్పటికీ భారీ శతకాలు నమోదు చేయలేకపోయానని ధావన్ గుర్తుచేసుకున్నాడు. "ఇషాన్ కిషన్ ఆ 200 పరుగులు చేసినప్పుడు, 'సరే అబ్బాయి.. బహుశా ఇదే నీ కెరీర్ ముగింపు కావచ్చు' అని నాలో నుంచే ఓ గొంతు వినిపించింది. ఆ తర్వాత అదే జరిగింది. నేను నిరాశలో ఉంటానని భావించిన నా స్నేహితులు నాకు ధైర్యం చెప్పడానికి వచ్చారు. కానీ నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాను" అని ధావన్ వివరించాడు.

2023 వన్డే ప్రపంచకప్ జట్టులో తనకు చోటు దక్కకపోవడానికి శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్ కూడా ఒక కారణమని గ‌బ్బ‌ర్‌ అంగీకరించాడు. "ఆ సమయంలో శుభ్‌మన్ గిల్ అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. నేను కేవలం వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నాను. కోచ్‌లు, సెలక్టర్ల దృష్టిలో అతను ముందున్నాడు. కాబట్టి అతడిని ఎంపిక చేయడంలో తప్పులేదు" అని ధావన్ వ్యాఖ్యానించాడు.

అంతకుముందు 2021 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా తనకు చోటు దక్కదని ముందే ఊహించానని ఆయన తెలిపాడు. "నా పేరు రాదని నాకు ముందే తెలుసు. ఆ విషయం నేను గ్రహించగలిగాను. అందుకే జట్టును ప్రకటించాక, నన్ను ఎందుకు ఎంపిక చేయలేదని నేను ఎవరినీ ఫోన్ చేసి అడగలేదు. అడిగినా వారి వాదన వారు వినిపిస్తారు, నా కథ నేను చెబుతాను. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని అన్నాడు. అయితే, జట్టు నుంచి తప్పించిన విషయంపై అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తనకు మెసేజ్ చేసి మాట్లాడారని ధావన్ వెల్లడించాడు.


More Telugu News