ఎడ్జ్ బాస్టన్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 ఆలౌట్

  • ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం
  • కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరోచిత డబుల్ సెంచరీ
  • 387 బంతుల్లో 269 పరుగులతో అదరగొట్టిన గిల్
  • రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కీలక ఇన్నింగ్స్‌లు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అద్బుత బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేసింది. ఇవాళ ఆటకు రెండో రోజున టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) సూపర్ డబుల్ సెంచరీతో చెలరేగడం తొలి ఇన్నింగ్స్ లో హైలైట్. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.

నిన్న టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ (2) విఫలమైనా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 387 బంతులు ఎదుర్కొని 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269 పరుగులు సాధించాడు. గిల్‌కు రవీంద్ర జడేజా (89) తోడవడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

మిడిల్ ఆర్డర్‌లో కరుణ్ నాయర్ (31), రిషభ్ పంత్ (25) పర్వాలేదనిపించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించడంతో భారత స్కోరు 580 పరుగులు దాటింది. కేఎల్ రాహుల్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (1) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ చెరో 2 వికెట్లు తీశారు. 


More Telugu News