ట్రినిడాడ్‌లో మోదీకి ప్రవాసుల నీరాజనం.. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో మార్మోగిన రాజధాని!

  • ఐదు దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ చేరుకున్న ప్రధాని మోదీ
  • భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మోదీకి స్వాగతం పలికిన ట్రినిడాడ్ ప్రధాని కమలా
  • పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
  • ‘మోదీ, మోదీ’ నినాదాలతో హోరెత్తిన విమానాశ్రయం, హోటల్ పరిసరాలు
  • దేశాభివృద్ధికి ప్రవాసుల కృషిని కొనియాడిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకున్నారు. రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా పెర్సాద్-బిస్సెసార్ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో మోదీకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సైనిక వందనంతో పాటు, భారతీయ పౌరాణిక పాత్రల ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలతో గౌరవపూర్వకంగా ఆహ్వానించారు.

విమానాశ్రయం నుంచి హోటల్ వరకు దారి పొడవునా పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రవాస భారతీయులు 'భారత్ మాతా కీ జై', 'మోదీ, మోదీ' నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. భోజ్‌పురి చౌతాల్ సంగీతం, ఆర్కెస్ట్రా ప్రదర్శనలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారి ఆత్మీయ స్వాగతానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చిన భారతీయులు అనేక రంగాల్లో రాణిస్తూ ట్రినిడాడ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో భారతదేశంతో తమకున్న బంధాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం గర్వంగా ఉంది" అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో పేర్కొన్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ట్రినిడాడ్ అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగాలూ, ప్రధాని కమలాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరుపుతారు. ఈరోజు ఆయన ట్రినిడాడ్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. సుమారు 180 ఏళ్ల క్రితం భారతీయులు తొలిసారిగా ట్రినిడాడ్ గడ్డపై అడుగుపెట్టిన చారిత్రక సందర్భంలో ఈ పర్యటన జరగడం విశేషం.


More Telugu News