సీఎం కలిపారన్న ఉద్ధవ్, రాజ్ థాకరే... క్రెడిట్ ఇచ్చినందుకు ఫడ్నవీస్ థ్యాంక్స్!

  • దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఉద్ధవ్, రాజ్ థాకరే
  • మరాఠీ భాషా పరిరక్షణ కోసం ముంబైలో ఉమ్మడి నిరసన
  • మమ్మల్ని కలిపినందుకు ఫడ్నవిస్‌కు ధన్యవాదాలన్న రాజ్ థాకరే
  • అధికారం కోల్పోయిన నిరాశతో ఉద్ధవ్ మాట్లాడుతున్నారన్న ఫడ్నవిస్
మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా ఉంటున్న అన్నదమ్ములు, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే శనివారం ముంబైలో ఒకే వేదికను పంచుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో హిందీని ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరాఠీ భాషా పరిరక్షణ కోసం నిర్వహించిన సభలో ఠాక్రే సోదరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ థాకరే... ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "మా నాన్న బాల్ థాకరే సైతం చేయలేని పనిని ఫడ్నవిస్ చేసి చూపించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని, మమ్మల్నిద్దరినీ ఒక్కటి చేశారు" అని వ్యాఖ్యానించారు.

ఇదే కార్యక్రమంలో ఉద్ధవ్ థాకరే సైతం ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందించారు. "అవును, మేము గూండాలమే. మరాఠీ ప్రజలకు న్యాయం జరగాలంటే గూండాయిజం చేయాల్సి వస్తే, అది కూడా చేస్తాం. మరాఠీ పరిరక్షణ మాకు గర్వకారణం" అని అన్నారు. ప్రభుత్వానికి శాసనసభలో బలం ఉంటే తమకు వీధుల్లో బలం ఉందని రాజ్ థాకరే హెచ్చరించారు.

థాకరే సోదరుల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఫడ్నవిస్ స్పందించారు. వారి కలయిక క్రెడిట్ తనకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూనే, ఉద్ధవ్‌పై విమర్శలు గుప్పించారు. "అధికారం కోల్పోయిన నిరాశతోనే ఉద్ధవ్ రాజకీయాలు మాట్లాడుతున్నారు. 25 ఏళ్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను పాలించి ముంబైకి చేసిందేమీ లేదు. మేము నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం" అని ఫడ్నవిస్ కౌంటర్ ఇచ్చారు.


More Telugu News